Weather Report : చురుక్కుమంటుంది.. సూదులు గుచ్చుకున్నట్లే... వచ్చుండాయ్ ఫీలింగ్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి

Update: 2025-02-19 04:26 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే చురుక్కుమనేలా శరీరంపై సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది. ఫిబ్రవరి మాసంలోనే ఈ ఫీలింగ్ తో ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలో అయితే ఉక్కపోత వాతావరణం మొదలయింది. రోజుకు మూడు సార్లు స్నానం చేయకపోతే శరీరం నుంచి వచ్చే చెమటతో దుర్వాసన వచ్చే పరిస్థితులున్నాయి. సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, ఉక్కపోతతో పాటు ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత మొదలయింది. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న కాలంలో మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏడు గంటల నుంచే...
ఉదయం ఏడు గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువుతుండటంతో పనులకు వెళ్లే వారు సయితం ఇబ్బందులు పడుతున్నారు. కూలీ పనులకు వెళ్లే వారి దగ్గర నుంచి ఆటో కార్మికులు, చిరు వ్యాపారులు నడి ఎండలో ఫిబ్రవరిలోనే వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. కొందరు అలసటతో ఇంటి దారి పడుతున్నారు. చెమట తీవ్రంగా కారుతుండటంతో నీరసానికి గురవుతున్నారని, తగినంత నీటిని వీలయినంత వరకూ ఎక్కువ సార్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత మజ్జిగ తీసుకోవడంతో పాటు కొంత ఖర్చయినా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిదని, దీనివల్ల డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటారని, తద్వారా అనేక రోగాల నుంచి బయటపడతారని చెబుతున్నారు.
రానున్న మూడు రోజులు...
రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే గరిష్టంగా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళ కొంత చలిగాలులు వీస్తున్నప్పటికీ ఏడు గంటలు దాటితే మాత్రం భానుడు భగభగ మండి పోతున్నాడు. ఏపీ, తెలంగాణలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరుకు నలభైకి చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ప్రయాణాలు చేసే వారు సయితం తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. వీలుంటే వాయిదావేసుకుంటే మంచిదని కూడా చెబుతున్నారు. సొంత వాహనాల్లో దూర ప్రయాణాన్ని వీలయినంత వరకూ తగ్గించడం మంచిదని కూడా అంటున్నారు.


Tags:    

Similar News