ఏడేళ్లుగా ఇదే తంతు... ఆ పని చేస్తే బెటరేమో?

2019 ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.

Update: 2022-03-16 02:31 GMT

కాంగ్రెస్ లో గత ఏడేళ్లుగా ఇదే తంతు. ఓటమి పాలు కావడం. తాము రాజీనామా చేస్తాననడం. నేతలు వద్దని వారించడం. వారికి అనుకూలంగా అన్ని రాష్ట్రాల నుంచి తీర్మానాలు చేసి పంపండం. కాంగ్రెస్ పార్టీలో ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. రాహుల్ గాంధీ మాత్రం తాను పార్టీ పగ్గాలు చేపట్టనంటారు. పెత్తనం మాత్రం నా చేతిలో నుంచి జారి పోకూడదని అంటారు. ఇలా కాంగ్రెస్ లో కధ నడుస్తూనే ఉంటుంది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేది లేదు. గాంధీ కుటుంబం దానిని వదిలిపెట్టేది కాదు.

వరస ఓటములతో....
వరస ఓటములతో కాంగ్రెస్ కుదేలయిపోయింది. 2019 ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు లేకుండా పోయారు. ఏదైనా గెలుపు లభిస్తే పార్టీ పదవి చేపట్టాలని రాహుల్ భావించి ఉండవచ్చేమో. కానీ మరోసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు ఘోర పరాజయాన్ని తెచ్చి పెట్టాయి.
రాహుల్ మాత్రం....
దీంతో రాహుల్ గాంధీ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవంటున్నారు. 2019లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఇప్పుడు ఏం సాధించారని పదవి చేపడతారన్న ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. అందుకే అధ్యక్ష పదవికి రాహుల్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. రాహుల్ కాకపోతే ఇంకెవరు? తమకు నమ్మకమైన నేతను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టే ప్రయత్నం గాంధీ కుటుంబం చేయవచ్చు. 2019 ఎన్నికల నాటికే కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వచ్చే ఎన్నికల నాటికి మరింత దిగజారుతుంది.
సీనియర్ల వత్తిడి....
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడి నియామకంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరో వైపు జీ 23 నేతలు శాశ్వత అధ్యక్షుడు కావాలని పట్టుబడుతున్నారు. ఈరోజు కూడా వారు సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే ఏం చర్యలు తీసుకోవాలో వారు సూచించనున్నారు. అయితే రాహుల్ వీరిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇక తాము జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మరచి, ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News