పెట్రోలు కోసం పడిగాపులు..కిమీల మేర బారులు తీరిన జనం

పాకిస్థాన్ లో పెట్రోలు కోసం జనం క్యూ లైన్ లలో రోజులతరబడి వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ మరో శ్రీలంక తరహాగా మారింది

Update: 2023-02-11 03:22 GMT

పెట్రోలు బంకులు మూతబడ్డాయి. పెట్రోలు కొరత తీవ్రంగా ఏర్పడింది. పాకిస్థాన్ లో పెట్రోలు కోసం జనం క్యూ లైన్ లలో రోజులతరబడి వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ మరో శ్రీలంక తరహాగా మారింది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థం కావడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గోధుమ పిండి కోసం ఘర్షణలు ఇంతవరకూ చూశాం. ఇక పెట్రోలు కోసం పడిగాపులు కాస్తున్నారు పాకిస్థానీయులు. విదేశీ మారక నిల్వలు అడుగింటి పోవడంతో ఆ ప్రభావం చమురు దిగుమతులపై పడి పెట్రోలు బంకులు అనేకం మూత బడ్డాయి.

కిలో మీటర్ల కొద్దీ...
దీంతో ఎక్కడైనా పెట్రోలు ఉందని తెలిస్తే అక్కడకు వెళ్లి బారులు తీరుతున్నారు. పెట్రోలు కొరతతో జనజీవనం పాకిస్థాన్ లో పూర్తిగా స్థంభించిపోయింది. ప్రధానంగా పంజాబ్ ప్రావిన్స్ లో అనేక పెట్రోలు బంకులు మూతబడటంతో జనం అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని డాన్ పత్రిక వెల్లడించింది. శ్రీలంక తరహాలోనే పాక్ లోనూ పెట్రోలు కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఒక వాహనానికి ఇంత పెట్రోలు అని రేషన్ విధించే అవకాశాలున్నాయని చెప్పింది. దాదాపు నెల రోజులుగా పెట్రోలు బంకులు మూతపడటంతో పరిస్థితి దారుణంగా తయారైంది.
అన్నీ బంద్...
ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాలన్నా పెట్రోలు దొరకని పరిస్థితి. చమురు కొరత ఏర్పడటంతో నిత్యావసర ధరలు కూడా నింగినంటాయి. పంజాబ్ ప్రావిన్స్ తో పాటు లాహోర్, గుజ్రన్ వాలా, ఫైసలాబాద్ వంటి నగరాల్లోనూ పెట్రోలు కొరత ఏర్పడింది. పాకిస్థాన్ రూపాయి కూడా కనిష్టానికి పడిపోవడంతో చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో పెట్రోలు కొరత తీవ్రమయింది. దీంతో పాటు విద్యుత్ కోతలను ప్రభుత్వం ఇ‌ష్టారీతిన అమలు చేస్తుంది. పాక్ ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నారని డాన్ పత్రిక తెలిపింది.


Tags:    

Similar News