ఖైదీ నెంబరు 6093 కి భయపడను : జగన్ పై ఫైర్

వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తాను ఎదుర్కొన్నానని, నువ్వెంత అని జగన్ ను ప్రశ్నించారు. నీకు భయపడే ప్రసక్తి లేదని అన్నారు

Update: 2023-01-12 14:38 GMT

తనకు ఉత్తరాంధ్రతో మంచి సంబంధాలున్నాయన్నారు. ఉత్తరాంధ్ర ఆట, పాట అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో ఆయన మాట్లాడారు. తనకు సగటు మనిషి ఆలోచనే ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కొద్దిమందికే దొరుకుతున్నాయన్నారు. తాను సినిమాలు చేస్తున్నా ఉద్యోగాలు, ఉపాధి లేని వారికోసమే తన మనసు ఆలోచించిందన్నారు. మనదేశ సంపద యువత అని ఆయన అన్నారు. మనల్లి ఎవర్రా ఆపేది అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఎవరినో తిట్టడానికి ఈ సభను పెట్టలేదన్నారు. తాను ఈరోజు ప్రతి వెధవ చేత, సన్నాసి చేత మాట్లాడినిపించుకుంటున్నా తనకు బాధలేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోతే తనను ఎవరూ తిట్టరని అన్నారు. మీ పక్షాన పోరాడటం కోసం తిట్టించుకోవడం దీవెనలుగానే భావిస్తామని తెలిపారు. సినిమాల్లో కష్టాలను మూడు గంటల్లో తీర్చవచ్చని, ఉద్దానం కష్టాన్ని తాను అక్కడ ఉండి తీర్చలేనని పవన్ కల్యాణ్ అన్నారు.

కలియబడే ఆంధ్ర...
తనకు పిరికితనం అంటే చిరాకు అని అన్నారు. సాహసం ఉంటేనే దేశం ముందుకు పోతుందన్నారు. యువతలో కోపం ఉంది కాని, అదే సమయంలో భయపడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర పోరాట గడ్డ అని అన్నారు. ఇది కళింగాంధ్ర కాదని, కలియబడే ఆంధ్ర అని, మీరు భయపెడితే ఎలా అని యువతను ప్రశ్నించారు. గిడుగు రామ్మూర్తి జీవితం తనకు స్ఫూర్తి అని అన్నారు. ఎప్పటినుంచో రాజకీయ నేతల దోపిడీ జరుగుతుందన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలను బానిసల్లా చూసే పరిస్థితి తనకు అసహ్యమేసిందన్నారు. తనకు గెలుపోటములతో సంబంధం లేదని, పోరాటం చేయడమే ఒక్కటే తెలుసునని అన్నారు. సుఖాలపై తనకు మమకారం లేదన్నారు. పార్టీ అకౌంట్లో 13 లక్షలు ఉన్నప్పుడే భయపడకుండా పోరాట యాత్ర ప్రారంభించానని అన్నారు. ఉత్తరాంధ్రలోని సమస్యలను తనను కదిలించి వేశాయన్నారు.

జనం వచ్చారు కాని ఓట్లేయలేదు...
రాజాంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని, కానీ ఓట్లేసే సమయంలో తనను వదిలేశారన్నారు. కానీ దానికి తాను బాధపడలేదన్నారు. ఆశయం ఉన్నవాడికి ముందడుగే ఉంటుందని, ఆశలు ఉండవని పవన్ అన్నారు. తాను చూడని డబ్బులేదని, తాను చూడని సుఖంలేదని ఆయన అన్నారు. శ్రీకాకుళంలో యాభై శాతం మంది వలసలు వెళ్లిపోయారని, ఏ రాజకీయ నేతలు మాట్లాడరని అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నీరసపడలేదని, యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను కాని, పరాజయంగా తీసుకోలేదని పవన్ ఆవేదన చెందారు. నా కడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, ప్రజలను వదలను అని చెప్పారు. ఫుల్ టైం పొలిటికల్ లీడర్స్ ఎవరూ లేరన్నారు. పార్టీని నడపాలంటే తాను సినిమాలు చేయాల్సిందేనని అన్నారు. మూడు ముక్కల ఆలోచనలు ప్రభుత్వానికి ఎక్కువ అని అన్నారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి అని పవన్ జగన్ పై ఫైర్ అయ్యారు.
వైఎస్ నే ఎదుర్కొన్నా... నువ్వెంత?
వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తాను ఎదుర్కొన్నానని, నువ్వెంత అని జగన్ ను ప్రశ్నించారు. నీకు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. శ్రీశ్రీని ఆకళింపు చేసుకున్న తనను ఎవరూ బెదిరించలేరన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్న మాట వాస్తవమేనని, విడాకులిచ్చి చేసుకున్నానని తెలిపారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి డంకా పలాస్ సలహాదారు అని అన్నారు. తాను అన్నింటికి తెగించిన వాడినని అన్నారు. రాజీ పడి బతికే మనస్తత్వం కాదన్నారు. తనకు డబ్బు ఆనందం ఇవ్వలేదన్నారు. నా ఎదురుగా వచ్చి ప్యాకేజీ అంటే జనసైనికుడి చెప్పుతో కొడతానని పవన్ హెచ్చరించారు. సంబరాల రాంబాబు అంటూ అంబటి రాంబాబుపై హెచ్చరించారు. తాను బతికి ఉన్నంత వరకూ వైసీపీతో యుద్ధం చేస్తానని అన్నారు. ఒక కులం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. కాపు కులం బాగుండాలని మాత్రమే తాను కోరుకోలేదన్నారు. కాపులు తనకు అండగా నిలబడకపోయినా పరవాలేదన్నారు.

ధర్మానపై విమర్శలు...
వైసీపీ ప్రభుత్వంలో ఒక కులానికే పదవులు లభిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తనకు తన కులం అండగా నిలబడకపోయినా ఇష్టమేనని అన్నారు. అందుకు ఓడిపోయినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఖైదీ నెంబరు 6093 కి తాను భయపడబోనని, డీజీపీ శాల్యూట్ కొడుతుంది కూడా ఖైదీకేనని అన్నారు. అన్నింటికీ తెగించిన వాణ్ణని అన్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటు తనాన్ని తొలగిస్తానని అన్నారు. తాను ఒక తరాన్ని మేలుకొలుపుతున్నానని అన్నారు. ఇంటలిజెన్స్ ఐజీకి తన గురించి తెలుసునని అన్నారు. చచ్చుతెలివితేటలన్నీ సలహాదారు సజ్జలకే ఉన్నాయన్నారు. మేలుకోకపోతే, జనసేన అండగా నిలబడకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయన్నారు. యువత కోసం తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని అన్నారు. ప్రతి నాయకుడు ప్రతి జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించుకోమని ఎద్దేవా చేశారు. ధర్మానపై విమర్శలు చేశారు. ధర్మాన భూముల వివరాల చిట్టాను పవన్ చదివారు. 1280 ఎకరాలను కాజేసినప్పుడు ఉత్తరాంధ్రపై ప్రేమ ఏమయిందని ప్రశ్నించారు. రాష్ట్రం ఇస్తే అప్పడంగా మింగేస్తారని అన్నారు.
డైమండ్ రాణి అంటూ రోజాపై...
వైసీపీతో యుద్ధం తప్పదని, గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడతాం తనకేం ఫరక్ పడదని అన్నారు. యువత సంకల్పం చేసుకోవాలన్నారు. కేవలం నినాదాలకే పరిమితం కావద్దని, ఎన్నికల టైం వరకూ కోపాన్ని దాచుకుని జనసేన మీట నొక్కేంత వరకూ మార్పు రాదన్నారు. ప్రధానమంత్రి తనను ఎందుకు పిలుస్తారని, మీ గుండెల్లో స్థానం ఇచ్చారు కాబట్టి తనను పిలిచారన్నారు. గెలిపిస్తే ఫలితాలను తేగలను కాని, ఓటమి చెందితే తాను పోరాటం చేయగలనని అన్నారు. డైమండ్ రాణి రోజా కూడా తనను గురించి మాట్లాడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సైకో పార్టీ అని పవన్ అన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ పథకాలను తొలగించమని తెలిపారు. అమ్మఒడి, వాహనమిత్ర, చిరు వ్యాపారులకు ఆసరా వంటి పథకాలను కంటిన్యూ చేస్తామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామన్నారు. వైసీపీ టెక్నికల్ గా గెలిచిందన్నారు.


Tags:    

Similar News