వీరిద్దరిదీ ఒక రూటు.. జగన్ ది మాత్రం?

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పదవులు ఇవ్వడం తక్కువగానే చెప్పుకోవాలి.

Update: 2021-12-02 07:12 GMT

ఎప్పుడైనా కొత్తగా వచ్చి పార్టీలో చేరే వారికి పదవులు దక్కుతాయి. ఇది ఫిక్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఏడు సంవత్సరాల రాజకీయ పరిస్థితులను ఒకసారి అవలోకనం చేసుకుంటే జంపింగ్ లకే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. కానీ జగన్ వీరికి భిన్నంగా కన్పిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పదవులు ఇవ్వడం తక్కువగానే చెప్పుకోవాలి. అందులో 2019 ఎన్నికలకు ముందు చేరిన సి.రామచంద్రయ్య, పండుల రవీంద్ర బాబు వంటి వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి.

పదవులు కొందరికి...
డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత వంటి వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో వారికి తిరిగి అదే పదవిని ఇచ్చారు. అంతే తప్ప పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ, నమ్మకంగా పనిచేస్తున్న వారికే జగన్ పదవులు ఇస్తూ వస్తున్నారు. దీంతో పార్టీలో చేరాలన్నా పదవులు రావేమోనన్న కొంత ఆందోళన ఉండటంతో చేరికలు లేవంటున్నారు. చంద్రబాబు హాయాంలో 23 మందిని పార్టీలో చేర్చుకుని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు.
కేసీఆర్ మాత్రం...
అలాగే పొరుగున ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి తన వెంట నడిచిన వారిని కాకుండా కొత్తగా కండువా కప్పుకున్న ఎల్. రమణ, కౌశిక్ రెడ్డి వంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. దీంతో ఇక్కడ ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. చంద్రబాబు కూడా ఇతర పార్టీల నేతలకే ప్రాధాన్యత ఇచ్చేవారు.
చేరికలు లేనిది అందుకే....
కానీ జగన్ మాత్రం తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారినే పదవులను ఎంపిక చేస్తున్నారు. అందువల్లనే ఇటీవల కాలంలో చేరికలు లేవని పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న రాజకీయాల్లో ఇన్ స్టెంట్ ఎదుగుదలను నేతలు కోరుకుంటున్నారు, చేరిన వెంటనే పదవులు కాంక్షిస్తున్నారు. కానీ జగన్ అందుకు విరుద్ధం. బేషరతుగానే చేరాలన్నది జగన్ కండిషన్. అందువల్లనే దాదాపు ఏడాది కాలంగా పార్టీలో చేరికలు లేవన్నది వైసీపీ నేతల అభిప్రాయం.


Tags:    

Similar News