జేసీ జబర్దస్త్ స్కిట్ పండిందా?

రాయల తెలంగాణ అంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు.

Update: 2023-04-25 04:25 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తొమ్మిదేళ్లు కావస్తుంది. అయినా ఇప్పటికీ కొందరు నేతలు సెంటిమెంట్‌ను పట్టుకుని వేలాడుతున్నారు. తాజాగా రాయలసీమ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలంటే ఎవరికీ అర్థం కాలేదు. రాష్ట్రం విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం ఎలా చూడాలి? ఏపీలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురు కాబట్టే జేసీ ఈ మంత్రం ఉపయోగించారా? లేక రానున్న ఎన్నికల్లో సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నంలో భాగంగా అన్నారా? అన్నది తెలియదు కానీ జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నం మాత్రం రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

సీరియస్‌గా తీసుకోరు కాబట్టి...
ఒక ఫ్యాక్షన్ నాయకుడు రాయలసీమలో నీటి కోసం పరితపించడమేంటని నెటిజన్లు సోషల్ మీడియాలో స్మైల్ ఈమోజీలు పెడుతున్నారంటే జేసీ కామెంట్స్‌ను రాయలసీమ వాసులు ఎంత సీరియస్‌గా తీసుకున్నారన్నది అర్థమవుతుంది. జేసీ దివాకర్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒకసారి తెలుగుదేశం గెలవడం కష్టమంటారు. మరోసారి జగన్ మరోసారి అధికారంలోకి రాలేదంటారు. అంత కన్ఫ్యూజన్‌లో జేసీ ఉంటారు. రాయల తెలంగాణ అంశం సమసిపోయిన అంశం. విభజన జరిగినప్పుడే అది పెద్దయెత్తున వినిపించి ఉంటే కొంత ఆలోచించి ఉండేవారు. కానీ ఇప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా జేసీ దివాకర్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు విచిత్రంగా కనిపిస్తుంటాయి. అనిపిస్తుంటాయి.
తొమ్మిదేళ్లు దాటిన తర్వాత...
ఇప్పుడు రాయల తెలంగాణకు ఎవరు ముందుకు వస్తారు? తెలంగాణలోని పార్టీలు ఎందుకు అంగీకరిస్తాయి? మరోసారి రాయలసీమ పెత్తనాన్ని తమ రాష్ట్రంలో ఎందుకు కోరుకుంటారు. రాయల తెలంగాణ వస్తే జగన్, చంద్రబాబుకు కూడా పట్టు పెరుగుతుంది. అందుకనే బీఆర్ఎస్ నుంచి బీజేపీ వరకూ ఏ పార్టీ అందుకు అంగీకరించదు. అంతెందెందుకు జగన్, చంద్రబాబు వంటి ముఖ్య నేతలు ఏపీకి దూరమవుతారు. అలాంటిది రాయల తెలంగాణకు ఎందుకు అంగీకరిస్తారు? ఈ లాజిక్‌ను జేసీ దివాకర్ రెడ్డి మిస్ అవుతున్నారంటున్నారు. తనకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు తలెత్తినప్పుడే జేసీకి రాయల తెలంగాణ గుర్తుకు వస్తుందంటారు. అంతెందుకు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జేసీ వ్యాఖ్యలు విని నవ్వుకునే ఉంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరు.
ఇబ్బందులుంటేనే...
రాయల తెలంగాణ వస్తే తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరమవుతాయని జేసీ చెబుతున్నారు. ఏపీలో కూడా ఎందుకు సాధ్యం కాదన్న ప్రశ్నకు జేసీ వద్ద సమాధానం లేదు. గత ఎన్నికల్లో తాడిపత్రితో సహా అనంతపురంలో తన కుటుంబ సభ్యులు ఓటమి పాలు కావడంతో జేసీ దివాకర్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిందనే వారు కూడా లేకపోలేదు. విభజన జరిగిన తొమ్మిదేళ్లు దాటిన తర్వాత కూడా రాయల తెలంగాణ అంటే ప్రజలు కూడా ఎందుకు అంగీకరిస్తారని అంటున్నారు. అయితే జేసీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు కాబట్టి సరిపోయింది. ఒక ఉద్యమాన్ని నిర్మించలేని నేత కాబట్టి సర్దుకుపోతున్నారు. అంతే తప్పించి జేసీ మాటలను రాజకీయంగా ఎవరూ సీరియస్ గా తీసుకోరు. పొలిటికల్ తెరమీద కనిపించే కమెడియన్‌గా మాత్రమే జనంతో పాటు రాజకీయ పార్టీలు చూడటం వల్లనే ఆయన కామెంట్స్ పెద్దగా పట్టించుకోరు కాబట్టి సరిపోయింది. లేకుంటే ప్రజలు సీరియస్‌గా తీసుకుంటే. అందుకే జేసీ దివాకర్ రెడ్డిని సీరియస్‌గా మాత్రం ఎవరూ తీసుకోరన్నది వాస్తవం.


Tags:    

Similar News