మునుగోడు.. ముగ్గురిలో గెలుపు ఎవరిదంటే?

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నిక కోసం సిద్ధమయ్యాయి.

Update: 2022-10-03 07:45 GMT

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నిక కోసం సిద్ధమయ్యాయి. ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో పోటీ నెలకొంది. ఎవరికైనా గెలుపు వన్ సైడ్ కాదు. డబ్బులు ఎంత వెచ్చించినా ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ మూడు పార్టీల్లో నెలకొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ పోటా పోటీగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబరు 6న ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 7 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల రోజుల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

నెల రోజుల ముందు నుంచే...
షెడ్యూల్ ఈరోజు అయితే విడుదలయింది కాని.. అక్కడ ఎన్నికల హీట్ మొదలయి నెల రోజులు కావస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ భారీ బహిరంగ సభను పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వరాల జల్లును ప్రకటించారు. మరో బహిరంగ సభకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అయినప్పటికీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే టీఆర్ఎస్ ప్రకటిస్తుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఆయన ఇప్పటికే మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలను కూడా ఈ పార్టీ ప్రోత్సహిస్తుంది. మంత్రి జగదీష్ రెడ్డి అంతా తానే అయి మునుగోడులోనే ఉంటూ ఉప ఎన్నికను తన భుజాలపై వేసుకున్నారు.
కేంద్ర నాయకత్వం...
భారతీయ జనతా పార్టీకి కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమే. శాసనసభ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నికలో గెలిస్తే ఆ పార్టీకి మరింత ఊపు వస్తుంది. అందుకే జాతీయ నాయకత్వం కూడా ఈ ఉప ఎన్నికలపై దృస్టి పెట్టింి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనకే టిక్కెట్ ఖరారవుతుంది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికపై దఫాలుగా సమావేశాలు పెట్టి దిశానిర్దేశం చేస్తున్నారు. మండలాల వారీగా నేతలను ఇన్‌ఛార్జిలను నియమించారు. స్టీరింగ్ కమిటీతో ఎప్పటికప్పుడు భేటీ అయి ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
సిట్టింగ్ సీటును..
కాంగ్రెస్ కు ఇది సిట్టింగ్ సీటు. ఇక్కడ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పాల్వాయి కుటుంబం పైన సానుభూతి ఎక్కువగా ఉంది. ఉప ఎన్నిక కావడంతో అగ్రస్థాయి నేతలందరూ మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టారు. మండలాలు, గ్రామాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించారు. బూత్ స్థాయిలో కమిటీలను నియమించుకుని వారితో సమన్వయం చేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే అభ్యర్థిని ప్రకటించారు. అక్కడ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద మూడు పార్టీలు గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నాయి. ఎవరిది గెలుపైనా మెజారిటీ మాత్రం తక్కువగానే ఉంటుందన్నది అంచనా.


Tags:    

Similar News