కలెక్టర్ సామీ.. పశువులపై పతాపమా?

ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనంలో వస్తుండగా గేదెలు అడ్డురావడంతో కాపలాదారుడికి జరిమానా విధించారు

Update: 2023-01-04 08:02 GMT

జిల్లా కలెక్టర్లకు కోపం వస్తే అంతే. వారు వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తారు. జిల్లా మెజిస్ట్రేట్ కావడంతో పోలీసులు కూడా వెంటనే చర్యలకు దిగుతారు. ఐఏఎస్ చదివి దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సిన కొందరు కలెక్టర్లు చివరకు వారికి చిన్న చికాకు కలిగించినా కేసులు పెడుతుంటారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇప్పుడు అదే వివాదంలో చిక్కుకున్నారు.

గేదెలు అడ్డురావడంతో...
కలెక్టర్ కృష్ణ ఆదిత్య తన వాహనంలో వస్తుండగా గేదెలు అడ్డురావడంతో కాపలాదారుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పాడి గేెదెలు తన వాహనానికి అడ్డం రావడమే కలెక్టర్ కోపానికి కారణం. గేదెలకు అది కలెక్టర్ వాహనమని తెలియదు. రోడ్డుపైకి ఎలాగంటే అలా వెళుతుంటాయి. వాటిని కంట్రోల్ చేసే బాధ్యత కాపలాదారుడిదే అయినా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక్కోసారి అవి ఎవరి మాట వినవు. తమ ఇష్టం వచ్చినట్లు వెళతాయి. ఎందుకంటే అవి పశువులు కనుక. మనం మనుషులం పక్కకు తప్పుకుని వెళతాం.

ఫైన్ వేయించి...
కానీ కలెక్టర్ మాత్రం కాపలాదారుడికి ఫైన్ వేయించారు. గంపోనిగూడెంకు చెందని బోయని యాకయ్య బోరు నరసాపురానికి చెందిన రైతుల పాడి గేదెలను అడివి వైపు తీసుకెళుతుండగా కలెక్టర్ వాహనం వచ్చింది. కలెక్టర్ వాహనానికి అడ్డుగా పశువులు వచ్చాయి. డ్రైవర్ హారన్ కొట్టినా అవి తొలగకపోవడంతో కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు కోపమొచ్చింది. వెంటనే యాకయ్యపై కలెక్టర్ మండి పడ్డారు. అంతటితో ఆగితే బాగుండేది. కానీ అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు యాకయ్యకు ఫైన్ వేశారు. ఏకంగా రూ.7500లు ఫైన్ వేశారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష తప్పదని అధికారులు యాకయ్యను హెచ్చరించారు. అతని ఇంటి నల్లా కనెక్షన్ ను కూడా తొలగించారు. సోషల్ మీడియలో ఇది వైరల్ కావడంతో కలెక్టర్ తీరు పట్ల నెటిజన్లు నిరసన తెలుపుతున్నారు.


Tags:    

Similar News