పొత్తులు లేకుండానే.. ఒంటరిగానే

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు లేకుండానే పార్టీలు బరిలోకి దిగుతున్నాయి

Update: 2023-02-14 05:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటిలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప, అనంతపురం, కర్నూలుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు స్థాానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నా అవి అధికార పార్టీ సొంతమవుతాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వైసీపీదే మెజారిటీ కావడంతో ఆ స్థానాలు ఖచ్చితంగా ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడతాయి.

వైసీపీకి మాత్రం...
ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఉపాధ్యాయులు సహజంగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, జీతాలు సకాలంలో జమ చేయకపోవడం, పీఆర్సీ తదితర సమస్యలను పరిష‌్కరించకపోవడంతో ఉపాధ్యాయులు అధికార పార్టీకి దూరంగానే ఉంటారన్న అంచనాలు అయితే ఉన్నాయి. అది నిజం కూడా టీచర్ ఎమ్మెల్సీల్లో గెలుపు సాధించడం అధికార వైసీపీకి అంత సులువు కాదు. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పంపుతున్న బహుమతులు కూడా వెనక్కు పంపుతున్నారు.
ఈ ఎన్నికలలో మాత్రం...
ఇక పొత్తులతో 2024లో బరిలోకి దిగుతామంటున్న పార్టీలు కూడా ఈ ఎన్నికల విషయంలో కిమ్మనడం లేదు. ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే అలా అనుకోవడానికి లేదు. టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచే అవకాశాలు విపక్షాలుకు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీకి చెందిన మాధవ్ గెలిచారు. తిరిగి అక్కడి నుంచే గెలిచేందుకు మాధవ్ మరసారి బరిలోకి దిగుతున్నారు. కానీ జనసేన ఇంత వరకూ మాధవ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కానీ బీజేపీ మాత్రం తమతో జనసేన కలసి వస్తుందని చెప్పుుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడంతో యువత ఓట్లు ఎక్కువగా ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేత ఒక ప్రకటన చేయించాలని కమలనాధులు భావిస్తున్నారు.
పెదవి విప్పని పవన్...
కానీ పవన్ కల్యాణ‌్ మాత్రం ఆ ఎన్నికలపై పెదవి విప్పలేదు. ఎక్కాడా తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని పదే పదే చెబుతున్న జనసేనాని ఈ ఎన్నికల్లో మాత్రం మిన్నకుండి పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ బీజేపీని కలుపుకుని వెళ్లాలనుకుంటుంది. కానీ బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే కలసి వెళ్లాలనుకుంటుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మద్దతును కోరితే ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉన్నా, కమలనాధులు ఆ పని చేయడం లేదు. జనసేనతోనే తమ ప్రయాణమని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ పోస్టుకు మాత్రం టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇటు అధికార పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. సరే.. విజయం ఎవరిదైనా విపక్షాలు మాత్రం ఈ ఎన్నికలకు ఏకం కాకపోవడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News