ఏందయ్యా ఇది.. బోరు కొట్టిస్తున్నారుగా?

ఆంధ్రప్రదేశ్ లో నేతల ప్రసంగాలు చప్పగా సాగుతాయి. పంచ్ లు ఉండవు. చెప్పినవే చెబుతూ ముగ్గురూ బోరు కొట్టిస్తున్నారు.

Update: 2022-09-19 03:38 GMT

ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను ఆకట్టుకునేది తన ప్రసంగంతోనే. తాను చెప్పే మాటలకు జనం ఫ్లాటై పోవాలి. తెలంగాణలో అలాంటి రాజకీయ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగం వరకూ వినేవారికి సొంపుగా ఉంటుంది. ఎంతసేపు విన్నా బోరు కొట్టదు. అందుకే కేసీఆర్ మీడియా సమావేశమంటే గంటలు కొద్ది నడిచినా ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. ఆయన మాట్లాడే తీరు, విశ్లేషించే వైనం అందరినీ ఆకట్టుకుంటాయి. అవి నిజాలా? అబద్ధాలా? అన్నది పక్కన పెడితే తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. చరిత్రతో పాటు వర్తమానం, భవిష్యత్ అంశాలను కూడా ఆయన అలవోకగా చెబుతారు. స్క్రిప్ట్ చూసి చదివే అవకాశం లేదు. రేవంత్ కూడా అంతే. ప్రసంగాలు చూసి కొన్ని ఓట్లు పడే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తాయి. జనం విశ్వసించే విధంగా వారి మాటలుంటాయి.

ఏపీ నేతలు...
ఇక ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రాజకీయ నేతల ప్రసంగాలు అంత వేడిగా సాగవు. గతంలో ఎన్టీఆర్ అలా చెప్పేవారు. ఎన్టీఆర్ ప్రసంగం కోసం జనం ఎదురు చూసేవారు. కానీ ఇప్పటి నేతలు మాత్రం చెప్పినవే చెప్పి బోరు కొట్టిస్తుంటారు. అది చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా చివరకు సినిమాల నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ అయినా. చంద్రబాబును పక్కన పెడితే జగన్, పవన్ లు స్క్రిప్ట్ లు చూసి ప్రసంగాలు చేస్తుంటారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం స్పీచ్ ఫ్లో వెళుతుంది. ఎన్ని సమావేశాలైనా, ఎన్ని మీటింగులైనా అవే ఉదాహరణలు.. అవే సామెతలు. మార్పు అనేది కన్పించదు. ముగ్గురు ప్రసంగాలను సామాన్యుడు కూడా ముందుగానే అంచనా వేయవచ్చు.
కనిపించని పంచ్ లు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం కూడా చప్పగా సాగుతుంది. పంచ్ లు లేవు. పసలేదు. అవే డైలాగులు. తిప్పి తిప్పి అవే చెబుతారు. దుష్టచతుష్టయం... నాలుగు మీడియా సంస్థల పేర్లు.. దేవుడి దయవల్ల.. మీ చల్లని దీవెనలతో ఇలా సాగుతుంది. వినీ వినీ ఎవరికైనా బోరు కొడుతుంది. చివరకు రెండు రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార వికేంద్రీకరణపైన చర్చలో కావచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కావచ్చు. ఎలాంటి మార్పు లేకుండా ఆయన ప్రసంగం సాగుతుంటుంది. కొన్ని సుభాషితాలు చెబుతున్నప్పటికీ జగన్ ప్రసంగంలో పస లేదన్న కామెంట్స్ చేస్తున్నారు. ప్రసంగం విన్న వారు మామూలు విషయాలేనని చర్చించుకునే పరిస్థితి మాత్రం ఉంది. జగన్ స్క్రిప్ట్ లేకుండా ప్రసంగించకపోవడం కూడా మైనస్సే. చూసి చదవడంతో ఆయన ప్రసంగంలో అప్పుడప్పడూ తప్పులు కూడా దొర్లుతుంటాయి.
అనుభవం ఉన్నా...
ఇక చంద్రబాబు ప్రసంగం బోరు. కొన్నేళ్ల నుంచి అదే తంతు. స్క్రిప్ట్ లేకపోయినా ఆయన చేసే విమర్శలు.. విసిరే సవాళ్లు నవ్వు తెప్పిస్తాయి తప్పించి ఫైర్ పుట్టించవు. ఆయన సమావేశం అంటే ముందుగానే మీడియా మిత్రులు రాసుకునే డైలాగులు అనేకం ఉంటాయి. లక్ష కోట్ల అవినీతి, రాజారెడ్డి రాజ్యాంగం, కడాన, తలచుకుంటే ఊరుకోను, ఖబడ్డార్ వంటి పదాలు ప్రతి స్పీచ్ లోనూ దొర్లుతాయి. అందుకే చంద్రబాబు ప్రసంగం అది ఎన్నికలు కావచ్చు.. మరో సమయంలో కావచ్చు చప్పగానే కొనసాగుతుంది. ఆయన నలభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయవేత్త అయినా ప్రసంగంలో మాత్రం ఇంకా అనుభవం లేనట్లే వ్యవహరిస్తారన్నది పార్టీ నేతలు అంగీకరిస్తారన్నది వాస్తవం.
పేలని డైలాగులు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వతహాగా సినిమాల నుంచి వచ్చారు. డైలాగులు అలవోకగా చెబుతారు. డైలాగ్ మాడ్యులేషన్ ఓకే. ఉన్నట్లుండి హై పిచ్ లోకి వెళతారు. మళ్లీ నవ్వేస్తారు. సీరియస్ గా చెప్పి ఆయన నవ్వడంతో అప్పటి వరకూ పవన్ చెప్పిన సీరియస్ డైలాగులను కూడా జనం కామెడీగా తీసుకుంటారు. ఆయన స్పీచ్ కూడా స్క్రిప్ట్ ల మేరకే నడుస్తుంది. కొన్నిసార్లు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడినా మాట్లాడే అంశాలకు ఒకదానికి ఒకటికి పొంతన ఉండదు. ఒక అంశంపై మాట్లాడుతూ మరొక అంశానికి జంప్ అయిపోతుంటారు. జనాలకు మాత్రం చివరకు ఏదీ చేరదు. ఆయన ఏం మాట్లాడరన్నది మరుసటి రోజు పత్రికల్లోనైనా, టీవీల్లోనైనా చూసి చూడాల్సిందే. వినాల్సిందే. ఇలా ఏపీలోని ముగ్గురు అగ్రనేతలు మాత్రం ప్రసంగాలు విని ఓట్లేస్తారన్నది అవాస్తవం. వేరే కారణాలే వారిని అందలం ఎక్కిస్తున్నాయన్నది నిజం.


Tags:    

Similar News