దాణా స్కామ్ లో లాలూ ప్రసాద్ కు ఐదేళ్లు జైలు, భారీగా జరిమానా

దాణా స్కామ్ లో దోషిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారైంది. రాంచీ సీబీఐ కోర్టు

Update: 2022-02-21 09:17 GMT

దాణా స్కామ్ లో దోషిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారైంది. రాంచీ సీబీఐ కోర్టు లాలూకి షాక్ ఇచ్చింది. ఝార్ఖండ్ లోని రాంచి సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 15వ తేదీనే లాలూని కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన కోర్టు.. దాణా కేసులో ఆయనను దోషిగా తేల్చింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో దోషిగా ఉన్న లాలూ, దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసులోనూ దోషిగా తేలారు. మొత్తం ఐదు కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా నిర్థారణ అయ్యారు.

అవిభాజ్య బీహార్​కు లాలూ ప్రసాద్​ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. 1997 జూన్ లో సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులను చేర్చగా.. వారిలో 55 మంది మరణించారు. మరో ఏడుగురు ప్రభుత్వం తరపున సాక్షులుగా మారిపోయారు. ఇద్దరు నేరం అంగీకరించి లొంగిపోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఆఖరికి లాలూ సహా 99 మంది నిందితులు ఉండగా.. వారిపై రాంచీ సీబీఐ స్పెషల్ కోర్టు ఫిబ్రవరి నుంచి విచారణ మొదలుపెట్టింది.
దుమ్కా, దేవ్​ఘడ్​, ఛాయ్​బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. ఆయనకు మొత్తం 14 ఏళ్లు శిక్ష, రూ.60లక్షల జరిమానా పడింది. 2013 సెప్టెంబర్​లో దోషిగా తేలి, తొలిసారి రాంచీ జైలుకు వెళ్లారు. 2013 డిసెంబర్​లో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. అయితే.. 2017 డిసెంబర్​లో మరో కేసులో దోషిగా తేలగా.. లాలూ బిర్సా ముండా జైలుకు వెళ్లారు. 2021 ఏప్రిల్​లో ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.


Tags:    

Similar News