ఏపీ ప్రభుత్వానికి ఆ థ్రెట్ ఉందా?

కేసీఆర్ మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ కూల్చివేత అంశం హాట్ టాపిక్ గా మారింది

Update: 2022-11-07 08:16 GMT

నిజమే.. ఇప్పుడు కేసీఆర్ మాటలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రాజకీయ నేతల చెెవుల్లో రింగు మంటున్నాయి. ఏపీ ప్రభుత్వాన్ని కూడా కూలదేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ చేశారని ఆ ముగ్గురు మాట్లాడిన వీడియోలో వినపడినట్లు కేసీఆర్ చెప్పారు. దీంతో డిసెంబరు నెలలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇంటలిజెన్స్ ను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగా, ఏపీలో జగన్ ప్రభుత్వం తొలిసారి పవర్ లోకి వచ్చింది. ఇద్దరూ బంపర్ మెజారిటీని సాధించారు. ఈ ప్రభుత్వాలను కూలదోయాలంటే అది సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఇద్దరిదీ ఒకటే..
అయితే ఇద్దరు ముఖ్యమంత్రులపైనా ఒక అపవాదు మాత్రం ఉంది. ఇద్దరు సీఎంలు ఎమ్మెల్యేలతో కలిసే వారు కాదు. ఒక రకంగా నియంతల్లా వ్యవహరిస్తారన్న విమర్శలు ఇద్దరిపైనా ఉన్నాయి. ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులు కూడా కేబినెట్ సమావేశాల్లో తప్ప వారిని కలుసుకునే అవకాశం లేదు. తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకోవాలనుకున్నా వీలుండదు. ఒకవేళ తమ నియోజకవర్గంలో ఏదైనా ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటే తప్ప ఇద్దరూ ఎమ్మెల్యేలకు అందుబాటులోకి రారు. వారి డిమాండ్ల చిట్టా వినరు. ఇద్దరూ వారి ఫొటో వల్లనే అధికారంలోకి వచ్చామన్న ధోరణితో ఉంటారు. ప్రాంతీయ పార్టీలు కావడంతో అధినేతలే మోనార్క్ లు. వారు చెప్పిందే వేదం. వారు అనుకున్నట్లే జరగాలి తప్పించి ప్రజాస్వామ్య బద్దంగా నిర్ణయాలు ఉంటాయనుకోవడం అపోహ మాత్రమే.
అసంతృప్తి ఉన్నా...
అందుకే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంటుందని అంచనా వేశారన్నది కొందరి అభిప్రాయం. కూల్చివేత అనేది చాలా పెద్ద విషయం. ఏపీలో తీసుకుంటే బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. జగన్ పార్టీకి 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే తెలంగాణలోనూ బీజేపీకి ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు ప్రభుత్వాలను కూలగొట్టాలంటే ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే కావాలి. అయితే అంత ధైర్యం, ఆ సాహసం ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తారా? అంటే చేయరనే అనుకోవాల్సి ఉంటుంది. కేవలం ఏడాది, ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు పార్టీ మారేందుకు ఎవరూ ఆలోచన చేయరు. అందులో రెండుచోట్లా అధికార పార్టీగానే ఉండటంతో అది సాధ్యం కాదన్నది విశ్లేషకుల అంచనా.
సమయం ఎంత?
ఎమ్మెల్యేల్లో అంత అసహనం ఉంటే అధికారంలో ఉన్న పార్టీని వీడేంత ధైర్యం చేయరు. ఒకవేళ మారినా ఏపీలో అయితే టీడీపీ వైపో, జనసేన వైపో చూస్తారు కాని ఏమీ లేని బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడరు. అందుకే వీళ్లెవరో మాట్లాడిన మాటలు ట్రాష్ గా వైసీపీ అధినాయకత్వం కొట్టిపారేస్తుంది. పైగా జగన్ ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. కేసీఆర్ శత్రువుగా ఉన్నా వారికి వచ్చే నష్టమేమీ లేదు. ఇద్దరూ కాంగ్రెస్ కు వ్యతిరేకులే. అందుకే ఈ కొనుగోలు వ్యవహారం అంతా ఒట్టి బూటకమని ఏపీ వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఏపీలో అంత సీన్ లేదని, తెలంగాణలోనూ అంతేనని వస్తే, గిస్తే రెండు చోట్ల బీజేపీ వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లోనైైనా గెలిస్తే చాలునన్న కామెంట్స్ పొలిటికల్ అనలిస్ట్‌ల నుంచి వినపడుతున్నాయి.

Tags:    

Similar News