అందరి చూపూ కిర్లంపూడి వైపు

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారు.

Update: 2023-05-10 07:23 GMT

ysrcp plans to field mudragada padmanabham's daughter-in-law siri from tuni constituency

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే రాజకీయాల్లో తన పాత్రపై నిర్ణయాన్ని ప్రకటిస్తానని ముద్రగడ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ పద్మనాభం ఇక యాక్టివ్ కావడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వేరే పార్టీలో చేరతారా? లేదా ముద్రగడ కొత్త పార్టీ పెట్టనున్నారా? అన్న సందేహం కూడా అందరికీ రానుంది.

రీఎంట్రీకి ముహూర్తం...
తుని రైల్వే దహనం కేసును కోర్టు కొట్టివేయడంతో ఆయన రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరేందుకు మాత్రం సిద్ధంగా లేరని తెలిసింది. ఆయన రాసిన బహిరంగ లేఖలోనే తుని రైలు దహనం కేసులో అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించడానికి హెలికాప్టర్‌ను కూడా సిద్ధం చేశారని పేర్కొనడంతో ఆయన ఆ రెండు పార్టీలకూ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అయితే జనసేన టీడీపీతో కలవకుండా కేవలం బీజేపీతో పొత్తుకే పరిమితమయితే మాత్రం జనసేనలో చేరే అవకాశాలను కొట్టి పారేయలేం అంటున్నారు.
సెకండ్ ఇన్సింగ్స్ స్టార్టయ్యేది అప్పుడే
ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కూడా ఆయనను తమ పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందుకు భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. కాకినాడ ఎంపీ సీటు లేదా రాజ్యసభ స్థానం ముద్రగడ పద్మనాభంకు, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చేలా ఇక ప్రతిపాదనను ముద్రగడ పద్మనాభం వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ముద్రగడ మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం కిర్లంపూడిలోనే ఉన్న ముద్రగడ పద్మనాభం తనకు అత్యంత సన్నిహితులతో మాత్రం సమాలోచనలు ప్రారంభించారని తెలిసింది.
పవన్‌కు పోటీగా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా కూటమిని తయారు చేసే పనిలో ఉన్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓట్లు ఈసారి చీలకుండా చూడాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం యాక్టివ్ అయితే ఏ పార్టీలో చేరతారు? ఎవరికి మద్దతు పలుకుతారు? అన్నది మాత్రం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన రాసిన బహిరంగ లేఖలో కూడా ప్రజల్లో మార్పు కావాలని కోరారు. తమ జాతి రిజర్వేషన్లు జోకరు కార్డులా మారడాన్ని మాత్రం తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్న ముద్రగడ కాపుల చిరునవ్వే తనకు ఆక్సిజన్అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఎవరికి ఇబ్బందిగా మారతుందన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News