కుమారస్వామిని చూశావుగా?

కన్నడనాట కుమారస్వామి పరిస్థితిని చూశాకయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆలోచనలో మార్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది

Update: 2023-05-14 04:16 GMT

కన్నడనాట కుమారస్వామి పరిస్థితిని చూశాకయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆలోచనలో మార్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కుమారస్వామికి సొంత సామాజికవర్గమైన ఒక్కలిగలు అండగా నిలబడలేదు. తనకు పట్టున్న పాత మైసూరు ప్రాంతంలోనూ కుమారస్వామి గెలవలేదు. వక్కలిగలు కాంగ్రెస్‌కే జై కొట్టారు. ఇటు లింగాయ‌త్‌లు కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. అలా ఉంటుంది మరి. జనంతో పెట్టుకుంటే. ఏపీలోనూ అంతే కావచ్చు. కాపు సామాజికవర్గ మంతా గంపగుత్తగా తన వెనకే ఉంటుందున్న అంచనాల నుంచి పవన్ బయటకు వస్తే మంచిది.

పార్టీని బలోపేతం చేసుకోకుండా...
ముందుగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. ఒక్క ప్రాంతంతోనే సరిపెట్టుకోవాలనుకుంటే చెల్లదు. అంతకంటే ముఖ్యంగా నేతలను నమ్మాలి. నాకు 46 శాతం ఓట్లు ఇవ్వండి నేను సీఎం అవుతాను అంటే కుదరదు. ఎందుకంటే అంత శాతం ఓట్లు ఇచ్చేది ప్రజలు. ఒక్క సామాజికవర్గం కాదు. అంతేకాకుండా పార్టీ అధినేత నుంచి కింది స్థాయి క్యాడర్‌ వరకూ కష్టపడాలి. కుమారస్వామి పార్టీలో ఆ లోపం వల్లనే కేవలం ఇరవై లోపల స్థానాలకే పరిమితమయింది. జేడీఎస్ ఘోర పరాజయానికి కారణం కేవలం సామాజికవర్గం పైన ఆధారపడటమే. అంతేకాకుండా తాను పదేళ్ల నుంచి పార్టీని బలోపేతం చేసుకోకుండా అవతలి వారిని ఓడిస్తానని, అధికారంలోకి రానివ్వనని చెప్పడం వినడానికి బాగానే ఉంటుంది తప్ప.. పోలింగ్ కేంద్రాల వద్ద పనిచేయవన్నది గుర్తుంచుకోవాలి.
ఎవరినో ఓడించడానికి...
అలాగే తనకు తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి. కింగ్ మేకర్‌ను అవుతాననుకుంటే అది నెరవేరదు. తాను సీఎం పదవి కోసం కాదని, అవతలి వారిని ఓడించడానికే నంటూ ఎన్నికలకు రావడాన్ని కూడా ఎవరూ హర్షించరు. మరీ ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు ఉంటాయని జూన్ నుంచి ఏపీలోనే ఉంటానని చెప్పడాన్ని బట్టి చూస్తే ఎన్నికల కోసమే తాను వస్తానని చెప్పకనే చెప్పారని అర్థమవుతుంది. అంతే తప్ప ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయాలు చేయడానికి మాత్రం పవన్‌కు సుతారమూ ఇష్టంలేదు. ఆయనను ఏపీ ప్రజల్లో సింహభాగం పార్ట్ టైం పొలిటిషియన్‌గానే పరిగణిస్తారు. ప్రజల్లో ఉన్న బలమైన ఆ అభిప్రాయాన్ని తొలగించుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే ఏపీలో ఉండాలి. ఇక్కడే పాలిటిక్స్ చేయాలి.
సీమలో సీన్ లేదంటూ...
అలాగే రాయలసీమలో తనకు బలంలేదంటూ ముందుగానే చెప్పి పవన్ తన అసమర్థతను తానే బయటపెట్టుకున్నారు. ఇది ఎవరికి లాభంగా మారుతుందో చెప్పలేం కాని, పవన్ కయితే నష్టమే. తాను అనుకున్న ప్రకారం పొత్తులు కుదుర్చుకున్నా ప్రజలంతా ఒక మాట మీద నిలబడితే....అదీ గ్రామీణ ప్రాంత ప్రజలు... ముఖ్యంగా పేద వర్గాలంతా ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఎందుకంటే క్యూలైన్‌లో నిలబడి ఓట్లేసి వాళ్లే కాబట్టి. వారు అనుకున్న వారే ముఖ్యమంత్రి అవుతారు. వారు జై కొట్టిన పార్టీకే అధికారం దక్కుతుంది. పవన్ కల్యాణ్ కన్నడ రిజల్ట్ చూశయినా కొంతలోకొంత ఆలోచనలో మార్పు తెచ్చుకుంటారని ఆశించడంలో తప్పులేదంటున్నారు జనసైనికులు. ఇక పై ఆయన ఇష్టం.


Tags:    

Similar News