విన్నది నిజమేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు

Update: 2023-05-08 04:32 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇన్నాళ్ల తర్వాత నాగబాబును ఎందుకు నియమించారన్న దానిపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాపు సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ పార్టీలో పవన్ నెంబర్ వన్ అయితే.. నెంబర్ టూగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ప్రతి జిల్లాలో నాదెండ్ల తిరుగుతూ పార్టీ క్యాడర్‌ను ఉత్సాహ పరుస్తున్నారు. పవన్ కల్యాణ్ వరస సినిమాలతో బిజీగా ఉండటంతో అంతా నాదెండ్ల తానే అయి చూసుకుంటున్నారు. జిల్లాలకు వెళ్లి మరీ సమావేశాలు జరిపి క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

ముద్రపడటంతో...
దీంతో పవన్‌పై ఒక ముద్ర పడింది. పార్టీని నాదెండ్లకు పూర్తిగా వదిలిపెట్టడంతోనే టీడీపీకి పొత్తుల రూపంలో దగ్గర చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేకపోవచ్చు. నాదెండ్ల టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చి ఉండవచ్చు. ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ పవన్ కల్యాణ్‌ను పొత్తుల విషయంలో నాదెండ్ల తప్పుదోవ పట్టిస్తున్నారన్నది మాత్రం క్యాడర్‌లో బలంగా ఉంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో కూడా మెజారిటీ అభిప్రాయం ఇలాగే వినపడుతుంది. గతంలో నాదెండ్ల కారణంగా అనేక మంది నేతలు జనసేనకు దూరమయ్యారన్న విమర్శలు కూడా ఇందుకు తోడయ్యాయి. అందుకే నాగబాబును పార్టీలో తన తర్వాత స్థానంలో ఉండేలా పవన్ జాగ్రత్త పడ్డారంటున్నారు.

నమ్మకమైన మిత్రుడిగా...
నిజానికి పార్టీ పెట్టిన తర్వాత నమ్మకమైన మిత్రుడిగా పవన్ వెంట ఉన్నది నాదెండ్ల మాత్రమే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే విషయంలోనూ నాదెండ్ల నోరు మెదపలేదంటారు. కానీ 2019 ఎన్నికలు పూర్తయిన వెంటనే బీజేపీతో సత్సంబంధాలు నెరపాలన్న నాదెండ్ల సలహాను కూడా పవన్ పాజిటివ్‌గా తీసుకున్నట్లు చెబుతారు. దీనికి తోడు పవన్ కు మోదీ అంటే అమితమైన ఇష్టం కావడంతో పొత్తు సులభంగా మారింది. రాజధాని అమరావతి విషయంలోనూ పవన్ మనసు మారడానికి నాదెండ్ల కారణమని చెబుతారు. తొలి నాళ్లలో రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తూ పవన్ అనేక ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఛేంజ్ కావడం వెనక మనోహర్ మంత్రాంగం ఉందంటారు.
నాగబాబు vs నాదెండ్ల...
నాదెండ్ల మనోహర్‌కు రాజకీయంగా కొంత అవగాహన ఉండటంతో పవన్ ఆయనను నమ్ముతారంటారు. నాదెండ్ల విషయంలో ఎవరు ఏమి చెప్పినా పవన్ వినరన్నది జనసేన నేతలు చెప్పే మాట. అలా అందరూ చెప్పినవీ నమ్మితే ఇక పార్టీని ఎలా నడుపుతారు? ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా? అన్నది పవన్ నుంచి వినపడుతున్న ప్రశ్న. నాదెండ్ల తనను మోసం చేసే వ్యక్తి కాదని, కొంత నిజాయితీ, ముక్కుసూటితనం ఉన్న నేత అని పవన్ ఇప్పటికీ నమ్ముతారు. అందుకే వేదికపై రెండు కుర్చీలుంటే. ఒకటి తనది. మరొకటి నాదెండ్లది అవుతుంది. కానీ ఇప్పుడు వేదికపై మూడో కుర్చీ వేసేశారు పవన్ కల్యాణ్. సొంత సామాజికవర్గంలో నాదెండ్ల పేరు నానుతుండటంతో నాగబాబుకు కీలక పదవి ఇచ్చారంటారు. మరి ఇప్పుడు జనంలో తిరగడం, క్యాడర్‌‌లో జోష్ నింపడం నాగబాబు వంతుగా మారింది. మరి నాగబాబు ఇందులో ఎంత మేర సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News