బాబు సినిమా అయిపోయింది

Update: 2018-06-15 12:55 GMT

రాష్ట్రంలో ఓ వైపు మహిళలు నడుపుకునే కుటీర పరిశ్రమలు కూడా మూత పడుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన సుందరముఖారవిందాన్ని చూసి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటున్నారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జరిగింది. సాయంత్రం రావులపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు చేసేదంతా అవినీతి అని, చూపించేది సినిమా అని విమర్శించారు. ప్రతీ సోమవారం పోలవరం సినిమా చూపిస్తారని, ఇంకా పునాది కూడా పడని ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని విమర్శించారు. చంద్రబాబు తానా అంటే ఎల్లో మీడియా తందానా అంటుందని పేర్కొన్నారు.

తెలంగాణాలో కాళేశ్వరం....

తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంటే, మన వద్ద పోలవరం పనులు మాత్రం పడకేశాయన్నారు. బాబు సీఎం కాకముందు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ.16 వేల కోట్లు ఉండగా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రూ.56 వేల కోట్లకు పెంచి అవినీతి చేశారన్నారు. నాలుగేళ్లలో పోలవరం పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. కేవలం డయాఫ్రాం వాల్ కట్టి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టినట్లుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు ఇంద్రభవనాన్ని కట్టుకున్నాడని విమర్శించారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను తానే కనిపెట్టానని చెప్పే చంద్రబాబు వారి రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.

Similar News