ఈ సిట్టింగ్ లంతా అవుట్... గులాబీ పార్టీ నేతల్లో గుబులు

తెలంగాణలో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలయింది. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కదన్న ఆందోళనలో వారు ఉన్నారు.

Update: 2022-11-09 03:12 GMT

తెలంగాణలో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలయింది. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కదన్న ఆందోళనలో వారు ఉన్నారు. కమ్యునిస్టు పార్టీలు డిసైడ్ అయినట్లే కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల ఫలితం కామ్రేడ్లలో ఉత్సాహాన్ని నింపింది. శాసనసభలో ప్రాతినిధ్యం దక్కాలంటే టీఆర్ఎస్ తో కలసి నడవాలన్న నిర్ణయానికి వచ్చినట్లే కనపడుతుంది. దీంతో సిట్టింగ్ స్థానాల్లో కొందరు సీట్లు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని సీట్లు అనేది ఎన్నికల సమయానికి నిర్ణయించుకుంటాయి. వామపక్షాలు ముప్ఫయి స్థానాలు కోరితే.. టీఆర్ఎస్ పది స్థానాలు ఇవ్వొచ్చు. కానీ కారుకు ఎర్రజెండాలు కట్టని పరిస్థితి. ఇద్దరి అవసరం అంతే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు కామ్రేడ్ల అవసరం ఉంది. అలాగే రెడ్ బ్రదర్స్ కు కూడా అంతే అవసరం.

కొన్ని సిట్టింగ్ స్థానాలను...
అయితే కొన్ని టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను వామపక్ష పార్టీలకు వదిల పెట్టాల్సి వస్తుంది. ఎలా కాదనుకున్నా పది స్థానాలను మాత్రం అధికార టీఆర్ఎస్ కోల్పోవాల్సి వస్తుంది. అందులో సిట్టింగ్ లు కూడా ఉంటారని చెప్పక తప్పదు. సీపీఐ ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టిక్కెట్ ను కోరతారు. ఆయన 2009లో కొత్తగూడెం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అదే స్థానాన్ని కోరుకుంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు టిక్కెట్ కోల్పోతారు. ఇదే స్థానాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆశిస్తున్నారు. దీంతో ఆయన ఆశలపై కూడా గులాబీ బాస్ నీళ్లు చల్లక తప్పేట్లు లేదు.
ముఖ్యమైన నేతల ఇలాకాలోనే...
ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ సీట్లను వారు కోరుకుంటారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా టిక్కెట్ ఆశిస్తారు. ఆయన 1996లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఈ సీటుపైన కూడా కామ్రేడ్లు కన్నేసే అవకాశముంది. ఖమ్మం సీటునే కోరుకుంటే అక్కడ మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు. ఆయనను తప్పించి తమ్మినేనికి ఇస్తారా? లేదా? నామా నాగేశ్వరరావును తప్పించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ్మినేనికి ఎంపీ సీటు ఇస్తారా? లేకుంటే మరో అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
పొత్తు కుదురుతుందని...
ఇక హుస్నాబాద్ టిక్కెట్ కూడా టీఆర్ఎస్ వదులుకోవాల్సి ఉంటుంది. అక్కడ సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కోరే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలో 2009లో జూలకంటి రంగారెడ్డి విజయం సాధించారు. ఈ సీటును కూడా సీపీఎం కోరే అవకాశముంది. అదే జిల్లాలో దేవరకొండ నియోజకవర్గాన్ని సీపీఐ కోరే అవకాశముంది. ఈ సీటులో 2014లో రమావత్ రవీంద్రకుమార్ సీపీఐ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018 లో టీఆర్ఎస్ నుంచి గెలిచి తిరిగి దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రవీంద్రకుమార్ ఉన్నారు. ఈ సీటు కూడా గులాబీ పార్టీ కోల్పోయే అవకాశాలున్నాయి. మునుగోడు కూడా వారికే కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది. వీటితో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను కూడా సీపీఎం, సీపీఐలు కోరే అవకాశముందంటున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలకు ఇప్పటి నుంచే గుబులు మొదలయింది.
Tags:    

Similar News