పవన్.. పూనకాలు.. రూట్ మ్యాప్ అదే

శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పొలిటికల్ రూట్ మ్యాప్ ను చెప్పకనే చెప్పారు

Update: 2023-01-13 06:36 GMT

శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పొలిటికల్ రూట్ మ్యాప్ ను చెప్పకనే చెప్పారు. తనను సీఎంగా చేయాలని ఎప్పుడూ కోరే పవన్ ఆ ఊసే ఎత్తలేదు. తనకు ఒక అవకాశమివ్వాలని హాజరయిన వారిని కోరలేదు. జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టంగా చెప్పలేదు. ఇటీవల చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ టోన్ మారినట్లుంది. క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తున్నా ఇంకా కన్ఫ్యూజన్ లో ఆయన అభిమానులను, పార్టీ క్యాడర్ కు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆయన మూడు గంటల ప్రసంగంలో ఎక్కడా తన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న ధీమాను వ్యక్తం చేయలేదు.


తేడా కొట్టినట్లు...

వ్యూహం ఉందంటాడు. పొత్తులు తప్పవంటాడు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని అంటాడు. ఓట్లు చీలవని అంటాడు. వైసీపీతో తాను జీవితంలో కలవనని అంటాడు. అదే సమయంలో ఒకప్పుడు టీడీపీని తిడితే ఇప్పుడు కలవకూడదా? అని ప్రశ్నిస్తాడు. రాజకీయాల్లో పొత్తులు ఎవరితో ఎవరైనా పెట్టుకోవచ్చు. తెలంగాణలోనూ పోటీ చేస్తానంటాడు. కానీ రాష్ట్ర విభజన చేసిన వాళ్లను వదిలేది లేదంటాడు. అసలు ఆయనకు ఆయనే క్లారిటీ లేనట్లుంది. డైలాగ్ కు డైలాగ్ కు మధ్య కొంత గ్యాప్ లేకున్నా ఎక్కడో తేడా కొట్టినట్లే అనిపించింది.

టీడీపీతో ప్రయాణం...
నిన్నటి పవన్ కల్యాణ్ ప్రసంగం విన్నవారెవరికైనా చంద్రబాబుతో తన ప్రయాణం తప్పదని చెప్పకనే చెప్పారు. అధికార వైసీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తప్పులేదు. అధికారంలో ఉన్న పార్టీని ఎవరైనా తిట్టి తాము అధికారంలోకి రావాలనుకుంటారు. అదే సమయంలో పొత్తులు కుదిరితే మీ గౌరవం తగ్గదని చెబుతాడు. తాను ఎలాంటి వాటికి లొంగనని చెబుతాడు. గౌరవం తగ్గకుండా తాను టీడీపీని సీట్లను కోరుతానని ఆయన పరోక్షంగా చెప్పినట్లే. అదే సమయంలో తనను అభిమానించే వాళ్లు, కాపు సామాజికవర్గం కోరుకున్నట్లుగా సీఎం అనే కామెంట్ కు దూరంగా ఉండటం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది.

డిప్యూటీ సీఎం అయితే...
అయితే..గియితే డిప్యూటీ సీఎం కోరే అవకాశాలున్నాయని రాజకీయాలు కొద్దిగా తెలిసిన వారికి ఇట్టే అర్థమవుతుంది. డిప్యూటీ సీఎంలు చంద్రబాబు హయాంలో ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో ఐదుగురున్నారు. ఆరోవేలు కింద లెక్క. అలాంటి పదవి తీసుకుంటే ప్రయోజనమేంటని అప్పుడే కొందరు పెదవి విరుస్తున్నారు. కానీ జగన్ ను ఓడించేందుకు తాను టీడీపీతో పొత్తుతో వెళ్లక తప్పదని ఆయన రణస్థలంలో చెప్పినట్లయింది. అదే సమయంలో తన వెంట బీజేపీ వచ్చినా, రాకున్నా తనకు పెద్దగా ఫరక్ పడదని కూడా తేల్చి చెప్పారు. గెలిచిన తర్వాత కేంద్రంలో పెద్దలను మంచి చేసుకోవచ్చన్న ధోరణి ఆయనలో కన్పించిందంటున్నారు. మొత్తం మీద రణస్థలంలో పవన్ పూనకాలు పొలిటికల్ రూట్ మ్యాప్ ను చక్కగా చూపించాయి.


Tags:    

Similar News