రోజా బ్యాడ్ లక్... చెవిరెడ్డి సీటీ బజాయించినట్లే?

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేస్తే చిత్తూరు జిల్లాలో రోజాకు ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం లేదు.

Update: 2022-01-28 04:24 GMT

నిజమో కాదు తెలియదు. కొత్త జిల్లాల ఏర్పాటు కొందరికి రాజకీయంగా ఇబ్బందిగానూ, మరికొందరికి అనుకూలంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ 26 జిల్లాలుగా మార్చారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ అవుతుందని చెబుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఏ ప్రాంతం ఏ జిల్లా అన్నది పక్కన పెడితే ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కొందరు ఇబ్బంది ఎదుర్కొనక తప్పేలా లేదు. ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చంటున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో...
జగన్ మంత్రి వర్గ విస్తరణకు ఉగాది ముహూర్తం పెట్టుకున్నారట. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చేస్తే మాత్రం చిత్తూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత రోజాకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వచ్చి పడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేవు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలున్నాయి.
చెవిరెడ్డికి మాత్రం....
అయితే అదే సమయంలో చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా కొత్తగా ఏర్పడే శ్రీ బాలాజీ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం శ్రీబాలాజీ జిల్లాలోకి వచ్చి చేరింది. శ్రీబాలాజీ జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. దీంతో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురులేకుండా పోయింది.
జిల్లాల వారీగా తీసుకుంటే.....
వచ్చే మంత్రి వర్గ విస్తరణలో జగన్ జిల్లాల వారీగా మంత్రుల కేటాయించేందుకు సిద్ధమయినా రోజాకు ఇబ్బంది. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండటంతో ఆమెకు అవకాశాలు తక్కువ అదే సమయంలో శ్రీబాలాజీ జిల్లా నుంచి చెవిరెడ్డికి పెద్దగా పోటీ లేదనే చెప్ాపలి. అక్కడ ఉన్నవాళ్లంతా కొత్త వారు కావడంతో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా విషయంలో మాత్రం ఎప్పటిలాగే నిరాశ పడకతప్పదేమోనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News