గోరంట్ల గిల్లుడు అందుకేనా?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయనది

Update: 2022-01-26 06:58 GMT

గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయనది. రాజమండ్రి కేంద్రంగా ఆయన పాలిటిక్స్ లో ఎదిగారు. పార్టీ మారడమంటేనే ఆయనకు తెలియదు. చంద్రబాబు 1995లో ఎన్టీఆర్ ను పక్కకు నెట్టి చంద్రబాబు పార్టీని స్వాధీనం చేసుకున్నా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. తర్వాత తిరిగి చంద్రబాబు చెంతకు చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడరే కాదు. సిన్సియర్ కార్యకర్త కూడా.

ఏ విషయాన్ని....
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. కుండబద్దలు కొట్టేస్తారు. ఇటీవల రాజీనామా చేస్తానంటూ హంగామా చేసిన ఆయన కొంత రాజీ పడిపోయినట్లు కనపడుతుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వెళ్లిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సొంత నియోజకవర్గమైన అర్బన్ కు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలోని తన ప్రత్యర్థి ఆదిరెడ్డి అప్పారావును దెబ్బతీసే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు.
రచ్చ చేసి...
పార్టీ పదవుల్లో తన వారికి అన్యాయం జరిగిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీలో తన లాంటి వారికి చోటు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనవర్గానికి అన్యాయం జరిగిందని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదన్నారు. అంతేకాదు చంద్రబాబు పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా పిలిచి బుజ్జగించడంతో బుచ్చన్న కూల్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువ పవర్ ఫుల్ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తించినట్లుంది.
లోకేష్ కోసం స్పెషల్ సాంగ్....
ఆదిరెడ్డి అప్పారావు వర్గాన్ని దెబ్బతీయడంతో పాటు తన లెవెల్ పార్టీలో మరింత పెరగాలంటే చినబాబును మించిన రూట్ లేదని ఆయన తెలుసుకున్నట్లుంది. ఒకప్పుడు లోకేష్ నాయకత్వం వేస్ట్ అన్న బుచ్చన్న చివరకు లోకేష్ పుట్టిన రోజుకు ఏకంగా ఒక పాటను రూపొందించి విడుదల చేశారు. ఇదంతా లోకేష్ మీద ప్రేమ కాదట. చినబాబును ప్రసన్నం చేసుకుని ఆదిరెడ్డిని కంట్రోల్ చేయడానికే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లోకేష్ మీద ఈ స్పెషల్ సాంగ్ ను తయారు చేసినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో లోకేష్ ను వీరలెవెల్లో పొగడటం విశేషం. లోకేష్ వల్లనే టీడీపీ అధికారంలోకి వస్తుందని గీత రచన సాగింది. మొత్తం మీద లేటు వయసులో బుచ్చన్న ఆయువుపట్టును పట్టారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News