కామ్రేడ్ జార్జిరెడ్డి 50వ వర్థంతి : శాస్త్రీయ విద్యావిధానాన్ని సాధించడమే లక్ష్యం

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్, గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడారు. మతోన్మాద చీకటి కోణాలను..

Update: 2022-04-14 04:24 GMT

కామ్రేడ్, విప్లవ వాద విద్యార్థి సంఘాల నేత జార్జిరెడ్డి 50వ వర్థంతి నేడు. ఏప్రిల్ 14, 1972న జార్జిరెడ్డి అమరుడయ్యారు. జీనా హైతో మర్నా సీఖో కదం కదం పర్ లడ్ నా సీఖో అనే నినాదంతో శాస్త్రీయ సోషలిస్టు భావజాలంతో మతోన్మాద చీకటి కుహరాల్లో నిప్పురవ్వగా వెలిగారు. ఆయన అమరుడై నేటికి 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా.. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ జరగనుంది. అలాగే జార్డిరెడ్డి మిత్రుల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్థంతి సభ నిర్వహించనున్నారు.

విద్యాభ్యాసం

జార్జి రెడ్డి 1947, జనవరి 15 న పాల్ఘాట్ లో కేరళలో చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా బెంగళూరు, చెన్నై నగరాల్లో జరగ్గా.. ఉన్నత విద్యాభ్యాసం కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో కొనసాగించారు. హైదరాబాద్ లోని సెయింట్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. 1964-67లో నిజాం కళాశాలలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న జార్జి రెడ్డి.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లో ఏం.ఎస్సీ చేశారు. ఆ తర్వాత అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు) ను స్థాపించాడు.

చీకటి కోణాలను చీల్చి చెండాడుతూ..

ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నుంచి పుట్టుకొచ్చిందే ఆయన విప్లవం. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్, గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడారు. మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడుతూ.. చెగువేరా ప్రేరణతో గ్రామాలకు, బస్తీలకు తరలి వెళ్లాడు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు, సమావేశాలు నిర్వహించారు. ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.. పీడీఎస్ గా నిర్మితమైంది. జార్జిరెడ్డి మరణానంతరం అది పీడీఎస్ యూ గా మారింది. భూస్వామ్య- సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు జార్డిరెడ్డి పునాదులు వేశాడు. అందరూ ఒక్కటేనని.. కుల, మతాలకు ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

కత్తులతో పొడిచి..

విద్యార్థుల హక్కులతో పాటు మతోన్మాద ధోరణిని అరికట్టేందుకు పోరాడుతున్న జార్జిరెడ్డిని ఏప్రిల్ 14, 1972లో హత్య చేశారు. ఆరోజు జార్జిరెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగివస్తుండగా.. 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తిపోట్లతో చంపేశారు. పాతికేళ్లకే ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం నెలకొరిగింది. కానీ.. "జీనా హైతో మర్నా సీఖో కదం కదం పర్ లడ్ నా సీఖో" ఇప్పటి యువతరానికీ దిశానిర్దేశం చేస్తున్న విప్లవ హీరో జార్జిరెడ్డి. జార్జి రెడ్డి నిజజీవిత కథ ఆధారంగానే 2019, నవంబర్ 22న జార్జిరెడ్డి సినిమా విడుదలైంది.


Tags:    

Similar News