Tirumala : తిరుమలలో నేడు కూడా రద్దీ.. అసలు రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం మొదలయిన భక్తుల రద్దీ తిరుమలలో నేడు కూడా కొనసాగుతుంది. దీంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు. అందరికీ వసతి, అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో నూతన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చి శ్రీవారి వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. నూతన దంపతులు తిరుమలలో ఇటీవల కాలంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు అనేక రకాలుగా స్వామి వారి వద్దకు చేరుకుంటున్నారు. అలిపిరి రోడ్డు మార్గం నుంచి, శ్రీవారి మెట్ల మార్గం నుంచి ఎక్కువ మంది భక్తులు కాలినకడన చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీరికి శీఘ్ర దర్శనాన్ని కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,526 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,664 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.