Colombia : కొలంబియా కాంగ్రెస్ ఎన్నికల్లో పెట్రో పార్టీ ముందంజ

కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు చెందిన హిస్టారికల్ పాక్ట్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల్లో ముందంజ సాధించింది.

Update: 2026-03-10 02:23 GMT

An election official dismantles a voting booth after polls closed in legislative elections in Bogota, Colombia

కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు చెందిన హిస్టారికల్ పాక్ట్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల్లో ముందంజ సాధించింది. అయితే ప్రకటించిన సంస్కరణలు అమలు చేయాలంటే ఇతర పార్టీలతో కూటములు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న పెట్రో ప్రయత్నం కూడా వివాదాస్పదంగా మారింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో సెనేట్‌లో మొత్తం సీట్లలో దాదాపు నాలుగో వంతు హిస్టారికల్ పాక్ట్ పార్టీ దక్కించుకుంది. ఇది ఇతర పార్టీల కంటే ఎక్కువ.అయితే పెట్రోకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలూ గణనీయంగా సీట్లు సాధించాయి. మాజీ అధ్యక్షుడు ఆల్వారో ఉరిబే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ డెమోక్రాటిక్ సెంటర్ 103 సభ్యుల సెనేట్‌లో 17 సీట్లు గెలుచుకుంది.

ప్రతినిధుల సభ ఎన్నికల్లో...
ప్రతినిధుల సభ ఎన్నికల్లో మొత్తం ఓట్ల పరంగా డెమోక్రాటిక్ సెంటర్ పార్టీ ముందంజలో నిలిచింది. హిస్టారికల్ పాక్ట్ ఐదో స్థానంలో నిలిచింది. అయితే ప్రతినిధుల సభలో ఓట్ల సంఖ్యకు సీట్ల సంఖ్య నేరుగా సరిపోలదు. ప్రాంతాల వారీగా సీట్లు కేటాయించే విధానం అమలు చేసిన తర్వాత పెట్రో పార్టీకి అక్కడ కూడా ఎక్కువ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. లిబరల్, కన్జర్వేటివ్ వంటి సంప్రదాయ పార్టీలు సెనేట్‌లో బలహీనపడ్డాయి. గ్రీన్ పార్టీ కూడా తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. “దేశంలో మధ్యస్థ రాజకీయ స్వరాల నుంచి ఓటర్లు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా విభజన పెరుగుతోంది” అని బోగోటాలోని రాజకీయ విశ్లేషకుడు కార్లోస్ ఆరియాస్ అన్నారు.బోగోటా జవేరియానా యూనివర్సిటీ ఆర్థిక నిపుణుడు జార్జ్ రెస్ట్రెపో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మధ్య, కుడి భావజాల ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న కొలంబియా ఇప్పుడు ప్రజాకర్షక విధానాల ప్రభావానికి లోనవుతోందని ఆయన చెప్పారు.
తిరుగుబాటుదారులతో చర్చలకు ప్రయత్నించిందని...
“పెట్రో ప్రభుత్వం తక్షణంగా ప్రజాదరణ పొందే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే అవి దీర్ఘకాలంలో నిలబడవు” అని ఆయన అన్నారు. కనీస వేతనాన్ని భారీగా పెంచడం, పెట్రోల్ ధరలు తగ్గించడం, అదనపు పని గంటలకు ఎక్కువ చెల్లింపులు వచ్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వంటి చర్యలను ఆయన ఉదాహరణగా చూపించారు. “ఈ నిర్ణయాలు హిస్టారికల్ పాక్ట్ ప్రజాదరణను పెంచాయి. అదే సమయంలో విమర్శకుల ప్రజాదరణ తగ్గించింది” అని రెస్ట్రెపో వ్యాఖ్యానించారు.ఈ కాంగ్రెస్ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగాయి. దేశ భద్రతా విధానాలు, ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై ఆ ఎన్నికలు కీలకం కానున్నాయి.నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న పెట్రో ప్రభుత్వం మిగిలిన తిరుగుబాటుదారులతో చర్చలు జరపడానికి ప్రయత్నించింది. అలాగే కార్మిక చట్టాల్లో మార్పులు చేసింది. గత ఏడాది ద్రవ్యోల్బణం 5 శాతం ఉన్నప్పటికీ కనీస వేతనాన్ని 23 శాతం పెంచింది.

దేశ ఆరోగ్య వ్యవస్థను...

దేశ ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని పెట్రో అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైవేట్ బీమా సంస్థలు సామాజిక భద్రత చెల్లింపులు నిర్వహించే విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. అలాగే పెన్షన్ వ్యవస్థలో కూడా ప్రభుత్వ పాత్రను పెంచే మార్పులను సూచించారు. అయితే ఈ సంస్కరణలను పెట్రో ప్రత్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవి ప్రభుత్వ ఖర్చులను పెంచుతాయని వారు అంటున్నారు. తిరుగుబాటు గుంపులపై కూడా కఠిన వైఖరి అవసరమని వారు భావిస్తున్నారు. భూభాగాల కోసం పోరాటం చేస్తూ కోకైన్ వ్యాపారం ద్వారా నిధులు సమకూర్చుకుంటున్న ఈ గుంపులు పౌరులను బెదిరింపులు, అపహరణలతో ఇబ్బంది పెడుతున్నాయని వారు చెబుతున్నారు.ఇక ఆదివారం మధ్య, కుడి భావజాల పార్టీల కూటమి అధ్యక్ష అభ్యర్థి ఎంపికకు ప్రాథమిక ఎన్నిక నిర్వహించింది. ఇందులో డెమోక్రాటిక్ సెంటర్ పార్టీ సెనేటర్ పాలొమా వాలెన్సియా అభ్యర్థిగా ఎంపికయ్యారు.ఈ కూటమికి సుమారు 57 లక్షల ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో వాలెన్సియా బలమైన పోటీదారుగా నిలిచే అవకాశం ఉందని బోగోటాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు సెర్జియో గుజ్‌మాన్ తెలిపారు. కొలంబియా రాజ్యాంగం ప్రకారం పెట్రో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.
జూన్ లో మొదటి ఇద్దరి మధ్య...
అయితే ఆయన పార్టీ తరఫున సెనేటర్ ఇవాన్ సెపెడా పోటీ చేస్తున్నారు. సర్వేల్లో ఆయన ముందంజలో ఉన్నారు. అల్ట్రా కన్జర్వేటివ్ న్యాయవాది అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తరువాతి స్థానంలో ఉన్నారు. పాలొమా వాలెన్సియా ప్రాథమిక ఎన్నికల్లో గెలవడంతో కన్జర్వేటివ్ ఓట్ల కోసం ఆమె కూడా ప్రధాన పోటీదారుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. “అబెలార్డో అభ్యర్థిత్వం ఇప్పుడు బలహీనంగా కనిపిస్తోంది” అని గుజ్‌మాన్ అన్నారు. ఆయన కాంగ్రెస్ జాబితాకు సుమారు ఆరు లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. మే నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కనీసం ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే జూన్‌లో మొదటి ఇద్దరి మధ్య తుది పోరు జరుగుతుంది. బోగోటాలోని రోసారియో యూనివర్సిటీ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ యాన్ బాసెట్ మాట్లాడుతూ, కన్జర్వేటివ్ అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగ మార్పులపై పెట్రో ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు నిలిచిపోతాయని చెప్పారు. పెట్రో మాత్రం ఓటర్లకు అధికాధికారాలు ఇవ్వడం, ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేయడం కోసం రాజ్యాంగ మార్పులు అవసరమని చెబుతున్నారు. అయితే విమర్శకులు దీనిని అధికార కేంద్రీకరణ ప్రయత్నంగా పేర్కొంటున్నారు. అయితే సెపెడా గెలిచినా కూడా కొత్త కాంగ్రెస్ పరిస్థితుల్లో రాజ్యాంగం మార్చడం కష్టమవుతుందని బాసెట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. “ఎడమపక్షం గెలిచినా సీట్లలో నాలుగో వంతే ఉంది. రాజ్యాంగ మార్పులకు కూటమి భాగస్వాములు కూడా ముందుకు రావడం కష్టమే” అని ఆయన అన్నారు.


Tags:    

Similar News