Summer Effect : ఉక్కపోత.. వేడిగాలులు.. ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భానుడు భగభగలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఉక్కపోతతో పాటు వేడిగాలుల తీవ్రత కూడా ఒక్కసారిగా పెరిగింది. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత డిగ్రీలు పెరుగుతాయన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. వారి అంచనాలకు అనుగుణంగానే ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.
ఈ జిల్లాల్లో వానలు...
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్చి మొదటి వారంలోనే 38 నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి కాలం ముందుగానే వచ్చింది. సహజంగా మార్చిలో ఒక మోస్తరు ఎండలతో ప్రారంభమై ఏప్రిల్ నెల నుంచి కొంత పెరుగుతూ మే నాటికి పీక్స్ కు చేరుకుంటాయి. కానీ ఈసారి మాత్రం మార్చిలోనే పీక్స్ కు చేరుకోవడంతో ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ సమయంలో అమరావతి వాతావరణ కేంద్రం అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుందని, ఉరుములతో కూడిన వానలు కూడా పలుచోట్ల పడతాయని చెప్పింది.
పొడి వాతావరణం...
తెలంగాణలో నేడు కూడా పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అలాగే వేడిగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సెగ గాలులతో ఇప్పటికే చాలా చోట్ల జనం సతమతమవుతున్నారు. ఉత్తర తెలంగాణ ఇప్పటికే ఉడికపోతుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.