నారాయణ కామ్ గా ఏంలేడట

మాజీ మంత్రి నారాయణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉన్నారు

Update: 2023-02-10 04:07 GMT

తెలుగుదేశం పార్టీలో అంతే. చంద్రబాబుకు కొంతమంది నమ్మకమైన వారుంటారు. వారి ద్వారానే చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటారు. ఇంకో నేతను ఎవరినీ నమ్మరు. చంద్రబాబు మొదటి నుంచి అదే చేస్తారు. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే చంద్రబాబు ఆ జిల్లాకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఏ నాయకుడైనా ఎవరో ఒకరిపై ఆధారపడక తప్పదు. అందుకు చంద్రబాబు కూడా మినహాయింపు కాదు. ఏపీలోని అన్ని జిల్లాల్లో రాజకీయాలు ఆయనకు కొట్టిన పిండి అయినప్పటికీ కొందరు నేతలు చెప్పినట్లే నడుచుకోవడం ఆయన ఇన్నాళ్లూ అలవాటుగా మార్చుకున్నారు. అందులో మాజీ మంత్రి నారాయణ ఒకరు.

రాజకీయాలకు దూరమవుతారని...

నారాయణ రాజకీయాలకు దూరమవుతారని అందరూ అనుకున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో అస్సలు కనిపించడం లేదు. ఆయనపై ప్రభుత్వం పలు కేసులు నమోదు చేయడంతో ఆయన పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. తన విద్యాసంస్థలను మాత్రమే చూసుకుంటున్నారు. నెల్లూరు రాజకీయాలను పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో నెల్లూరు టౌన్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ మరోసారి పోటీ చేయాలన్న ఆలోచనలో లేనట్లుందని నిన్న మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. పార్టీ క్యాడర్ కు కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇక నారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే అని అనుకున్నారు.

కోటంరెడ్డి ఇష్యూలో...
కాని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇష్యూలో మరోసారి నారాయణ పేరు బయటకు రావడం పార్టీ నేతలను సయితం విస్తుపర్చేలా చేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబును కలసినప్పుడు ఆయన నారాయణతో టచ్ లో ఉండాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ నేతలున్నప్పటికీ నారాయణతోనే టచ్ లో ఉండమనడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతుంది. నారాయణ మళ్లీ యాక్టివ్ అవుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న క్లారిటీ లేకపోయినప్పటికీ నెల్లూరు టీడీపీ రాజకీయాలను మాత్రం నారాయణ శాసించనున్నారన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో....
నారాయణ ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవిని దక్కించుకోవచ్చు. అంతే తప్ప ఇలా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగి ఓటమి పాలయి పరువు పోగొట్టుకోవడం అనవసరమని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. పార్టీని ఆర్థికంగా ఆదుకునేందుకు నారాయణ ఎంతమాత్రం వెనకాడరు. నారాయణ రుణాన్ని చంద్రబాబు ఉంచుకోరు. ఏదో ఒక రూపంలో ఆయనకు పదవి కల్పిస్తారు. కాపు సామాజికవర్గానికి చెందిన నారాయణ చంద్రబాబుకు నమ్మకంగా ఉంటారు. అందుకే కోటంరెడ్డి విషయాన్ని కూడా నారాయణతో చర్చించిన తర్వాతనే ఓకే చెప్పినట్లు సింహపురి టాక్.


Tags:    

Similar News