ధర్మాన సీరియస్ గానే అన్నారా?

ముఖ్యమంత్రి జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

Update: 2022-10-08 04:25 GMT

ధర్మాన ప్రసాదరావు వైసీపీలో సీనియర్ నేత. మంత్రిగా ఆయన పదవి చేపట్టి నెలలు మాత్రమే గడుస్తుంది. అయితే ముఖ్యమంత్రి జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఉద్యమంలోకి వెళ్లాలని తనకు బలంగా ఉందని ఆయన తెలిపారు. విశాఖలో రాజధాని కోసం ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని పిలుపు నివ్వడమే కాకుండా, ఎట్టి పరిస్థితుల్లో విశాఖకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని పిలుపు నిచ్చారు. తాను ఉద్యమంలోకి వెళితే తన వెనక లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.

మంత్రి పదవి దక్కక...
తొలి విడత మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు పదవి దక్కింది. తనను జగన్ విస్మరించారని ఆయన పదే పదే బాధపడ్డారు కూడా. పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపైనా ఆయన మూడేళ్ల పాటు పెద్దగా స్పందించింది లేదు. అయితే రెండో దఫా మంత్రి పదవి దక్కడంతో కొంత యాక్టివ్ అయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచారు. మంత్రి పదవి కోసం ఎదురు చూసిన ఆయనకు చివరకు దక్కింది. అయితే ఇప్పుడు జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తానని ఎందుకు అన్నారన్న చర్చ ఆయన అనుచరుల్లోనూ ఇటు పార్టీలోనూ జోరుగా సాగుతుంది.
ఫ్రీ హ్యాండ్ లేదా?
ధర్మాన ప్రసాదరావు మంచి వక్త. ఆయన మాట్లాడే ప్రతి మాట నేరుగా జనంలోకి వెళతాయి. సబ్జెక్టు పరంగా ఆయనను ఎవరూ ఏ విధంగా తప్పుపట్టలేరు. జనం నచ్చి, మెచ్చే విధంగా ఆయన మాట్లాడతారు. సౌమ్యంగానే చెప్పినా సూటిగా ఏ విషయాన్నైనా చెప్పే సత్తా ధర్మాన ప్రసారావుకు ఉంది. అయితే ఇప్పుడు విశాఖ రాజధాని ఉద్యమంలోకి ఎందుకు పోవాలనుకుంటున్నారు? అదీ మంత్రి పదవిని వదిలి.. అంటే... మంత్రివర్గంలో ఉన్నా సంతృప్తికరంగా లేరా? ఆయనకు రెవెన్యూ శాఖలో ఫ్రీ హ్యాండ్ లేదా? అమరావతి ఉద్యమం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వెయ్యి రోజులపైగానే జరుగుతుంది. విశాఖ రాజధాని ప్రతిపాదన వచ్చి అంతే సమయం అయింది. ఉద్యమం చేయాలనుకుంటే మంత్రి పదవిలో లేని మూడేళ్లు ఏం చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది.
అనుమానం వచ్చిందా?
అయితే ఆయనను వ్యతిరేకించే వారు మాత్రం ఇందుకు అనేక కారణాలున్నాయని అంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ ఆరు సార్లు గెలిచింది. గుండ కుటుంబానికి మంచి పట్టుంది. ధర్మాన ప్రసాదరావు మూడు సార్లు గెలిచారు. ఈసారి తన కుమారుడు రామమనోహర్ నాయుడును పోటీ చేయించాలని భావిస్తున్నారు. అందుకే కుమారుడి గెలుపు కోసం ఈ ఉద్యమాన్ని ఊతంగా చేసుకోవాలని భావిస్తున్నట్లు కనపడుతుంది. గుండా ఫ్యామిలీ చేతిలో ఈసారి ఓటమి తప్పదని గ్రహించిన ధర్మాన ఈ రాజీనామా డ్రామాకు తెరతీశారని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. తన గ్రాఫ్ శ్రీకాకుళం నియోజకవర్గంలో తగ్గిపోయినందునే జగన్ అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళతానని ధర్మాన అని ఉండొచ్చన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే జగన్ అనుమతితో పనేంటి? మంత్రి పదవికి రాజీనామా చేసి ఉత్తరాంధ్ర ప్రజలపై అంత ప్రేమ ఉంటే ఉద్యమం చేయవచ్చు కదా? అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. మరి ధర్మాన ఏమంటారో? ఏం చేస్తారో? చూడాలి.
Tags:    

Similar News