కొంచెం కష్టం.. పెరుగుతున్న బలం
తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందా? గతంలో కంటే కొంత బెటర్ గా కనిపిస్తుందా? అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ సమర్థవంతంగా తన వైపు తిప్పుకుంటుందా? అంటే కొంత మేర అవుననే అనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని సంస్థలు చేసిన సర్వేలోనూ కాంగ్రెస్ పట్ల జనంలో సానుభూతితో పాటు ఒక్కసారి అధికారం ఇస్తే పోలా అన్న ధోరణి కనిపిస్తుందన్నది స్పష్టమయింది. బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి కాంగ్రెస్ ఎంత మేరకు పుంజుకుంటుందన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్నే అయినప్పటికీ జనంలో మార్పు కోరుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం.
ఎంత పాలన బాగా చేసినా..?
జనం ఎంత పాలన బాగా చేసినా మార్పు కోరుకుంటారు. ఇది మానవ నైజం. ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో మార్పు తప్పనిసరి. ఒకసారి పాలన బాగుంటుంది. రెండోసారి పాలన సుమారుగా అనిపిస్తుంది. మూడోసారి ఎన్నికలకు వచ్చే సరికి విసుగొచ్చేస్తుంది. మంత్రుల వ్యవహారశైలి, అధికారుల పనితీరు వంటివి కూడా పాలనపై ప్రభావం చూపిస్తాయి. అది ఎన్నికల సమయంలో ప్రజల్లో బయటకు వస్తుంది. ఇది ఎక్కడైనా జరిగేదే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. సొంతమూ కాదు. ఎంత మంచిగా పరిపాలించినా అందులో లోటుపాట్లు సహజం. తృప్తి పడే వారికంటే అసంతృప్తికి లోనయ్యే వారి సంఖ్య అధికార పార్టీకి రోజుకు రోజుకూ పెరిగిపోతుండటం సహజమే.
బలమైన పార్టీగా...
అయితే బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత స్థానంలో ఉందని నమ్మించేలా చేశారు. కానీ అది భ్రమ మాత్రమే. ఇక్కడ బీజేపీకి సరైన ఓటు బ్యాంకు లేదు. అలాగే సంస్థాగతంగా కూడా పార్టీ బలంగా లేదు. 2019లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలవడంతో తాము అధికారంలో వస్తామని ఆ పార్టీ భావిస్తూ ఎన్నికలకు వెళ్లడంలో తప్పేమీ లేదు. కానీ కాంగ్రెస్ ను అంత సులువుగా అంచనా వేయడానికి వీలులేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ త్వరితగతిన పుంజుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. ప్రజలు ఒక్కసారి చూద్దాం అని భావిస్తే సునామీ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కొన్ని జిల్లాలో...
ఇప్పటికే ఉమ్మం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకుందన్న వార్తలు వస్తున్నాయి. అనేక సర్వేల్లో కూడా ఇదే స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పుంజుకోవడానికి అనేక కారణాలున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర మాత్రమే కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తుండటంతో పాటు కొన్ని సమస్యలకు కాంగ్రెస్ అయితేనే పరిష్కారం చూపగలదన్న విశ్వాసం మరొక వైపు కనిపిస్తుందంటున్నారు. సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ అంతకు మించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవ్వగలదని నమ్మే వారు కూడా ఇటీవల కాలంలో పెరిగారు. అందుకే కాంగ్రెస్ ను ఆషామాషీగా చూసే వాళ్లకు వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఒక పాఠం చెబుతాయని కూడా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. మొత్తం మీద ఈ వార్తలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నా నేతలు ఐక్యతగా ఉండి పోలింగ్ వరకూ ఎలా వ్యవహరిస్తారన్న దానిపైనే ఆధారపడి ఉందన్నది కూడా ప్రశ్నార్ధకమే.