Ys Jagan : జగన్ కు వేకప్ కాల్.. మారకపోతే..మ్యాజిక్ ఫిగర్ ఈసారి చేరాలంటే?

వైసీపీ అధినేత జగన్ కు పలువురు సీనియర్ నేతలు సలహాలు ఇస్తున్నారు

Update: 2026-03-25 08:57 GMT

వైసీపీ అధినేత జగన్ కు పలువురు సీనియర్ నేతలు సలహాలు ఇస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులతో పాటు గతంలో వైఎస్ నుంచి ప్రయోజనం పొందిన పారిశ్రామిక వేత్తలు, మాజీ ఐఏఎస్ అధికారులు ఇలా.. అందరూ ఒకరి తర్వాత మరొకరు జగన్ మారకపోతే గెలుపు మర్చిపోవాలనే అంటున్నారు. ఇప్పటికే కొందరు జగన్ కు కొన్ని సూచనలు అందించినట్లు సమాచారం. మరికొందరు వైసీపీలోని జగన్ సన్నిహితులకు తమ అభిప్రాయాన్ని తెలియజేసి జగన్ కు చేరవేయాలని కూడా చెప్పారని విశ్వసనీయ సమాచారం. 2029 ఎన్నికలు జగన్ కు కీలకం.

నియోజకవర్గాల స్థానాలు పెరుతున్న సమయంలో...
అందులోనూ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ మారాలంటున్నారు. ఏపీలో 263 శాసనసభ నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవాలంటే అంత సులువు కాదు. మ్యాజిక్ ఫిగర్ 181 నియోజకవర్గాల్లో గెలవాల్సి ఉంటుంది. ఇలాగే ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఇప్పటి నుంచే అనేక రకాలుగా జగన్ పార్టీ బలోపేతానికి, నియోజకవర్గాలుగా నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. జగన్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై వైఎస్ సన్నిహితులు కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఫీడ్ బ్యాక్ పకడ్బందీగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ భవిష్యత్ అవకాశాలు, అలాగే ఎన్నికల వ్యూహాలపై జగన్ కు కొందరు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అభ్యర్థుల ఎంపికపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టి వారిని ప్రజల్లోకి పంపేలా చూసుకోవాలని కూడా జగన్ కు సలహా ఇస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను ముందుగానే గుర్తించి వారిని ప్రకటిస్తే మంచిదని కూడా చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అధికారులతో వ్యవహరించిన తీరు వల్ల వచ్చిన నెగటివ్ ఫలితాలను విశ్లేషించుకోవాలని, అధికార వ్యవస్థతో సమన్వయం లోపించడం ఒక ప్రధాన కారణంగా చర్చించబడినట్టు తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.





Tags:    

Similar News