పరిశోధన, శ్రమ ఈ పుస్తకంలో కనిపిస్తుంది : జస్టిస్ ఎన్వీ రమణ

సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లద్ శాండర్స్ బుక్ ను సుప్రీంకోర్టు సీజే ఎన్వీరమణ ఆవిష్కరించారు

Update: 2021-12-15 14:38 GMT

సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ పై రచించిన పరిశోధనాత్మక బ్లద్ శాండర్స్ బుక్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉడుముల కుటుంబంతో ఉన్న తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఉడుముల సుధాకర్ రెడ్డి బాబాయి జోజిరెడ్డి, తాను అమరావతిలోని ఎస్ఎస్ఎన్ కళశాలలో చదువుకున్నామని చెప్పారు. సుధాకర్ రెడ్డి తండ్రి రాయపరెడ్డి తనకు సీనియర్ అని, తన గ్రామం పొన్నవరంకు సమీపంలోని జగన్నాధపురంలో మంచి రైతు అని గుర్తు చేశారు. ఆరోజుల్లో కులాలు, మతాలు లేకుండా అరమరికలు లేకుండా అందరం గడిపేవారమని సీజే ఎన్వీ రమణ అన్నారు. ఆ ఊరూ, వాడా గుర్తుకొస్తున్నాయని, నాటి మిత్రులు గుర్తుకొస్తున్నారని, త్వరలో ఆ ఊరిలో పర్యటిస్తానని ఎన్వీ రమణ తెలిపారు. జర్నలిజం ప్రారంభం రోజుల్లో సుధాకర్ రెడ్డి తనకు పరిచయమని, ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగినందుకు జస్టిస్ ఎన్వీరమణ సంతోషం వ్యక్తం చేశారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ పై....
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు, చెట్ల నరికివేత, ముఠాలపై ఈ పుస్తకంలో అచ్చుగుద్దినట్లు రచయిత చెప్పారని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. ఎర్రచందనం చెట్ల నరికివేత కేవలం జాతిసంపదను హరించడమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుందని జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు. గత రెండు దశాబ్దాల కాలంలో అరవై లక్షల ఎర్ర చందనం చెట్లను నరికివేసినట్లు రచయిత చెప్పడం ఆందోళన కల్గిస్తుందన్నారు. 5,30,097 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం అడవుల్లో రెండు వేల మంది స్మగ్లర్లను ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారన్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు.
అద్భుతమైన రచన...
బ్లడ్ సాండర్స్ పుస్తకం వెనక సుధాకర్ రెడ్డి చసిన పరిశోధన, కృషి ఎంతో దాగి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ జర్నలిస్టుగా ఆయన చేసిన ట్రాకింగ్ ఈ పుస్తకంలో స్పష్టంగా కన్పిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. నడవటానికి కూడా కష్టమైన అడవుల్లో విస్తృతంగా సుధాకర్ రెడ్డి ప్రయాణించి స్మగ్లర్లతోనూ, అధికారులతోనూ నేరుగా మాట్లాడి ఈ పుస్తకరచనకు దిగారన్నారు. ఈ పుస్తకం రాయడానికి అత్యంత అర్హత ఉన్న వ్యక్తి సుధాకర్ రెడ్డి అని జస్టిస్ రమణ అన్నారు. సుధాకర్ రెడ్డి ఈ పుస్తక ఆవిష్కరణ కోసం తనను సంప్రదించినప్పుడు అవును అనడం తప్ప తనకు మరో మార్గం లేదని, అందుకు ఆయన జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభిచినప్పటి నుంచి తెలుసునని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.


Tags:    

Similar News