టీడీపీ గాడి లో పడిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టారు. మూడు రాజధానుల అంశం వైపు ఎవరూ మొగ్గు చూపకుండా నేతలను కట్టడి చేయగలిగారు

Update: 2022-10-29 07:23 GMT

చంద్రబాబు నాయుడును ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. తాను తీసుకున్న నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల నేతలు సమర్థించే విధంగా ఆయన నేతలను గాడి లో పెట్టారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో మూడు రాజధానుల అంశాన్ని అధికార వైసీపీ భుజానకెత్తుకుంది. ముఖ్యంగా ఉత్తారంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటు చేయడానికి ఉద్యమాలకు సిద్ధమయింది. జేఏసీల పేరుతో ప్రజల ముందుకు వెళ్లి సెంటిమెంట్ ను రగిలించే ప్రయ్నతం చేస్తుంది. ఇన్నాళ్లూ ఏ విధమైన కార్యక్రమం అధికార వైసీపీ చేయకపోవడంతో టీడీపీ అమరావతి ఒక్కటే రాజధాని అంటూ అన్ని ప్రాంతాల నేతల చేత చెప్పించింది.

ప్రజల్లో సెంటిమెంట్ ను...
అమరావతి రైతుల పేరిట ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాజధాని రైతుల పాదయత్ర వెనక కూడా టీడీపీ ఉందన్నది కాదనలేని వాస్తవం. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వైసీపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలలో మరింత సెంటిమెంట్ ను రాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కర్నూలుకు న్యాయరాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని కావాలంటూ ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయినా టీడీపీ నేతలు మాత్రం ఒక్క మాటపై నిలబడి ఉన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
అధికారంలో లేనప్పుడు...
అధికారంలో లేనప్పుడు సహజంగా పార్టీ అధినేత మాట ఎవరూ పెద్దగా వినరు. తమ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే నేతలు ఆశిస్తారు. వచ్చే ఎన్నికలలో తాము గెలిస్తే చాలని భావిస్తారు. కానీ ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ నేతలు అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలని చెబుతుండటం కొంత ఆ పార్టీలో ఉన్న క్రమశిక్షణకు ఉదాహరణ అని చెప్పక తప్పదు. ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తొలి నాళ్లలో కొండ్రు మురళి వంటి నేతలు విశాఖకు రాజధానిగా కావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అలాంటి వారు కూడా తమ స్వరం మార్చుకున్నారు.
అన్ని ప్రాంతాల నేతలు...
గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో ఎక్కువ మంది కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే. ఉత్తరాంధ్రలో ఆరుగురు, రాయలసీమలో ఇద్దరు మాత్రమే గెలిచారు. కానీ పార్టీని వీడింది ఎక్కువగా కోస్తాంధ్రకు చెందిన వారే. అంటే అమరావతి రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మరెవ్వరూ టీడీపీ గడప దాటి వెళ్లలేదు. ఇది రాజకీయంగా కష్టసమయంలో చంద్రబాబు సక్సెస్ కు కారణంగా చెప్పుకోవాలి. తమ్ముళ్లందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇటు సిక్కోలు నంచి అటు అనంతపురం వరకూ చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని నమ్మి పార్టీ నేతలు కొనసాగడం చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారన్నది వాస్తవం. తాజాగా పవన్ కల్యాణ్ కూడా కలసి వస్తారన్న సంకేతాలు వెలువడటంతో టీడీపీ మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తుందన్న నమ్మకంలో అధినేత ఉన్నారు.


Tags:    

Similar News