వీళ్లు బాబుకు శత్రువులా? మిత్రులా?

చంద్రబాబుకు శత్రువులు ఎక్కడో లేరు. పక్కనే ఉన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ల కామెంట్స్ వైరలయ్యాయి

Update: 2022-07-29 05:52 GMT

చంద్రబాబుకు శత్రువులు ఎక్కడో లేరు. ఆయన పక్కనే ఉన్నారు. ఎక్కడో హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటూ, అక్కడ ట్యాక్సులు కడుతూ ఏపీపై పెత్తనం చేయాలనుకునే వారితోనే చంద్రబాబుకు సమస్యగా మారిందని చెప్పాలి. ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు, దర్శకులు చంద్రబాబుకు వత్తాసు పలకడం ఇప్పటి నుంచి మొదలు కాలేదు. ఎన్టీఆర్ ను దించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు తెలివిగా సినిమా ఇండ్రస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నారు. తాను అధికారంలో ఉండగా వారికి ఇతోధిక సాయం చేస్తుండటంతో చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు వీరంతా ఆయన వైపు నిలుస్తారు. అదే ఆయనకు ఇప్పుడు ఇబ్బందిగా మారిందని చెప్పకతప్పదు.

హైదరాబాద్ లో ఉంటూ...
చంద్రబాబు ఒక సామాజికవర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తొలి నుంచి ప్రచారం ఉంది. వైసీపీ అందుకు అనుగుణంగా కమ్మ సామాజికవర్గం నేతలు లబ్దిపొందిన వైనాన్ని హైలెట్ చేస్తూ వచ్చింది. అయితే అధికారంలోకి రావాలంటే వైసీపీ, టీడీపీలకు వారి సామాజికవర్గాలు ఒక్కరే మద్దతిస్తే సరిపోదు. ఆ విషయం పార్టీ అధినేతలకు తెలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటూ అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక చంద్రబాబు అయితే అధికారంలో లేకపోతే విలవిలలాడిపోయే వారు కొందరున్నారు. వారిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, మరో చిత్ర నిర్మాత అశ్వినీదత్ లు ఇద్దరూ ముందు వరసలో ఉంటారు. సీనీ పరిశ్రమలో వ్యక్తుల కంటే రాజకీయ నేతలుగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి చంద్రబాబు ఆయనను గౌరవించారు.
డైరెక్టర్ గా ....
రాఘవేంద్రరావు ఇటీవల తెనాలి లో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. టీడీపీ మళ్లీ రావడం ఖాయమని చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి అవసరమని ఆయన చెప్పారు. నిజానికి రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వ్యాపారం చేయరు. ఆయన బిజినెస్ అంతా తెలంగాణలోనే. చంద్రబాబు రావాలని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై ఆయన తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తిరిగి తనకు నామినేటెడ్ పదవి లభించవచ్చన ఆశకావచ్చు.
ట్యాక్స్ లు అక్కడే కడుతూ....
తాజాగా అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బంది పెట్టేవే. వైసీపీ హయాంలో తిరుమల సర్వ నాశనం అయిందన్నారు. అక్కడ జరగని పాపం లేదని, జరుగుతున్న అన్యాయాలను చూడలేమన్నారు. ఏమయిందో? ఎందుకయిందో? అన్యాయాలేంటో మాత్రం చెప్పలేదు కాని తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అశ్వినీదత్ వ్యాఖ్యానించారు. అశ్వినీదత్ వ్యాపారాలు, నివాసం అంతా హైదరాబాద్ లోనే. ఆయన కారు కొన్నా తెలంగాణలో కొంటారు. ఇల్లు కొన్నా అంతే. అక్కడి ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. కృష్ణాజిల్లా స్వస్థలమైన అశ్వినీదత్ హైదరాబాద్ లో ఉంటూ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏవగింపుగా మారాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పులేదు కాని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారు పార్టీ సభ్యత్వం పుచ్చుకోవడమే బెటర్. ఇలాంటి వారితోనే టీడీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News