జగన్.. చంద్రబాబు తేడా ఏంటి?

వైసీపీ నుంచి క్యూ కట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.

Update: 2023-05-20 06:12 GMT

వైసీపీ నుంచి క్యూ కట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో నిజమెంత? నవ్వుకుని వదిలేసేవారు కొందరైతే.. జాకీలు పెట్టి టీడీపీని లేపడానికి విశ్వయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేసేవారు మరికొందరు. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, జగన్ ఇద్దరే నాయకులు. పవన్ కల్యాణ్ ఉన్నా అతనిని లీడర్‌గా ఎవ్వరూ చూడటం లేదు. పార్టీ పెట్టి పదేళ్లయినా ఒక్కరంటే ఒక్క బలమైన నేత కూడా ఆ పార్టీలో చేరతానని ముందుకు రాలేదు. అలయన్స్ ఉందని నెలలు నుంచి చెబుతున్నా ఎవరూ ఆ పార్టీలోకి వెళ్లే ధైర్యం మాత్రం చేయడం లేదు.

ఇద్దరూ సిసలైన లీడర్లే...
ఇక చంద్రబాబు, జగన్ మాత్రం అసలు సిసలైన నాయకులు. ఒకరు ఏడు పదుల వయసులోనూ శ్రమిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎవరైనా అభినందించాల్సిందే. ఇప్పటికే అన్ని జిల్లాలను చుట్టివచ్చిన సీబీఎన్ ఎండనక, వాననక రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. అలుపెరగకుండా ఆయన తిరగడం చూస్తే ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అసూయ పుట్టక మానదు. చంద్రబాబు ఇప్పటికీ మానసికంగా ధృఢంగా ఉన్నారు. ఏడాది క్రితం ఏమీ లేని పార్టీని ఇప్పుడు ఎలా తెచ్చారో చూసుకుంటే చాలు. ఆయన ఎంతటి సమర్థుడో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ పార్టీలోనూ, మిత్రపక్షాలుగా వ్యవహరించే వారు కూడా చంద్రబాబు నాయకత్వంపైనే నమ్మకం ఉందంటే అంతకు మించి ఆయనకు మరి ఏ విధమైనా రివార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కష్టపడి పార్టీని...
ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా దాదాపు అంతే. కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన నేత. జగన్ వల్లనే వైసీపీ ఉంది. వైసీపీ అంటేనే జగన్. ఒక్క జగన్ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందనేది కాదనలేని వాస్తవం. తనకు ఎదురైన కష్టాలను ఓర్చి, భయపడకుండా, బెదిరిపోకుండా శ్రమించి అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం కావచ్చు. ముఖ్యమంత్రిగా జనంలో తిరగలేకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల ఓటు బ్యాంకును నాలుగేళ్ల నుంచి సాలిడ్ గా సొంతం చేసుకున్న నేతగా చూడాలి. పార్టీకి పటిష్టమైన ఓట్లను సమకూర్చడంలో జగన్ ది ఒకస్టయిల్. చంద్రబాబుది మరొక స్టయిల్.
జగన్ ను నమ్ముకుంటే...?
అయితే జగన్ ను కాదని ఎవరూ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్లే వైసీపీ ఎమ్మెల్యేలకు ఇక రాజకీయ భవిష్యత్ ఉండదని తెలుసు. చంద్రబాబు 2014లో అధకారంలోకి వచ్చిన తర్వాత 23 మందిని తన పార్టీలోకి తీసుకున్నారు. వారిలో అత్యధిక శాతం మందికి 2019 ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇక చంద్రబాబు వారి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. జగన్ మాత్రం తనను నమ్మి వచ్చిన వారికి ఏదో ఒక పదవి కట్టబెడుతూ వెళుతున్నారు. రాజకీయాల్లో అది ముఖ్యం. తాము స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం పార్టీ మారితే దీర్ఘకాలంలో నష్టం జరిగే అవకాశముంటుందని అంచనా వేస్తారు. పైగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని మెప్పించాల్సి ఉంటుంది.
నచ్చితే ఇక అంతే....
కానీ వైసీపీలో అలా కాదు. జగన్ నచ్చాడంటే అంతే. ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా ఎమ్మెల్సీ అయినా కావచ్చు. కాకుంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా భవిష్యత్‌లో గ్యారంటీ. అందుకే గ్యారంటీ ఉన్న చోటు వదిలి ఏమాత్రం భద్రతలేని చోటకు వెళతారంటే ఎవరూ నమ్మరన్నది రాజకీయ విశ్లేషకుల సయితం అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకూ చేరికలు లేవు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు క్రాస్ ఓటింగ్ చేశారని ప్రశ్నించవచ్చు. అందుకు రహస్య ఓటింగ్‌ ఒక కారణమై ఇద్దరు. మరో ఇద్దరు ఆల్రెడీ తమను దూరం పెట్టడంతో మరో ఇద్దరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనడం వాస్తవం. జగన్ ఎవరికి సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా... నమ్మకంగా ఉండటమే బెటర్ అనుకునే వాళ్లే అధిక సంఖ్యలో ఉన్నారనడం వాస్తవం.


Tags:    

Similar News