టీ - 5 సిరీస్ లో గెలుపెవరది?

తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు వరసగా జరుగుతున్నాయి

Update: 2022-08-03 03:51 GMT

ఎందుకో తెలియదు కాని.. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు వరసగా జరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరిగితే ఐదు ఉప ఎన్నికలు ఈ మూడున్నరేళ్లలో జరిగినట్లుగా భావించాలి. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఇంకా 18 నెలల సమయం ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ కి గడిచిన నాలుగు ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం ఉప ఎన్నిక సిరీస్ లో 2 - 2 స్కోర్లతో బీజేపీ, టీఆర్ఎస్ సమంగా ఉన్నాయి. మరి సిరీస్ ఎవరి పరం అవుతుందన్నది చూడాల్సి ఉంది.

తొలుత హుజూర్ నగర్....
తెలంగాణలో 2018 లో ఎన్నికలు జరిగిన తర్వాత తొలుత హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వచ్చింది. ఎంపీగా ఎన్నికకావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ దక్కించుకుంది. ఎమ్మెల్యేగా సైదిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. వెయ్యి ఓట్ల లోపే బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయం సాధించారు. అనంతరం
హజూరాబాద్ లో....
ఆ తర్వాత నాగార్జునసాగర్ లో ఉప ఎన్నిక జరిగింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీగా పోరు జరిగింది. కానీ తన సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ నిలుపుకోగలిగింది. నోముల భరత్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ పోటీలో నిలబడలేకపోయింది. ఇక ఆ తర్వాత మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది. ఆయన బీజేపీలో చేరడంతో బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య పోరు జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
మునుగోడు ఎన్నికతో....
టీఆర్ఎస్ రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయి, ఒక సిట్టింగ్ స్థానాన్ని, ఒక కాంగ్రెస్ స్థానాన్ని దక్కించుకుంది. బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ రెండు స్థానాల్లో గెలిచి మూడు స్థానాలకు చేరింది. ఇక మునుగోడు ఉప ఎన్నికలో కూడా పోరు హోరాహోరీ సాగనుంది. ఇక్కడ ఎవరిది గెలుపన్నది ప్రజలు నిర్ణయించినా, ఎన్నికలకు ముందు జరిగే ఉప ఎన్నిక కావడంతో 2023 శాసనసభ ఎన్నికలకు రిహార్సల్స్ గా చూడాలి. అయితే విచిత్రమేమిటంటే జరిగిన, జరుగుతున్న ఉప ఎన్నికల్లో మూడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోవే కావడం విశేషం. నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మునుగోడు నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కాలుమోపుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News