హీరోలు నిజంగా హీరోలేనా?
తెలంగాణలో బీజేపీ కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తున్నట్లుంది. అందుకే సినీ హీరోలను అగ్రనేతలు కలుస్తున్నారు.
సినిమా హీరోలతో విజయం తథ్యమా? వారు చెబితే ఓట్లేసే పరిస్థితి ఉందా? భారతీయ జనతా పార్టీ మాత్రం యువత టార్గెట్ గా ముందుకు వెళుతుందనే చెప్పాలి. యువతను తమ పార్టీ వైపునకు తిప్పుకోవాలంటే సినిమా హీరోలు, సెలబ్రిటీలకు మించి మరో మార్గం లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సినిమా హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలతోనే రాజకీయ అధికారం వస్తుందని భావిస్తే అనేక రాష్ట్రాల్లో వాళ్లే పవర్ లో ఉంటారు. వారు చెప్పిన విధంగానే జనం కాని, యువత కాని పార్టీ దరి చేరారనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అనేక రాష్ట్రాల్లో ఈ విషయం స్పష్టమయింది. కానీ కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ లలో బీజేపీ ఈ విధానంతో కొంత సక్సెస్ అయింది. తెలంగాణలో బీజేపీ కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తున్నట్లుంది. అందుకే సినీ హీరోలను అగ్రనేతలు కలుస్తున్నారు.
గతంలో దక్షిణాదిన...
ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి నటుల దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలను శాసించారు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు తరం మారింది. నిన్న గాక మొన్న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పెట్టినా దానికి ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. కర్ణాటకలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజును కూడా ప్రజలు దగ్గరకు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ‌్ ను, అంతకు ముందు చిరంజీవిని కూడా ప్రజలు ఆశీర్వదించలేదు. పవన్ కల్యాణ్, కమల్ హాసన్ అయితే పోటీ చేసిన చోట కూడా ఓటమి పాలయ్యారు. యువత, వారి ఫ్యాన్స్ ఓట్లు గంపగుత్తగా వస్తాయని భావించడం కూడా అవివేకమే అవుతుంది. ప్రధానంగా ప్రస్తుత జనరేషన్ ఎక్కువగా తమ ఉపాధి అవకాశాలపైనే దృష్టి పెడుతుంది. అంతే తప్ప సినిమాలంటే చొక్కాలు చించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం.
యాక్టర్లు ఉన్నా...
కర్ణాటకలో ఎన్నికలకు ముందు యశ్, సుదీప్ లను కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి తిప్పారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలలో భోజ్‌పురి నటులను రంగంలోకి దింపారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా అదే ఫార్ములాను బీజేపీ ఉపయోగిస్తున్నట్లు కనపడుతుంది. నిజానికి బీజేపీలో సినిమా యాక్టర్లు లేరని కాదు. వారు పెద్ద సంఖ్యలోనే పార్టీలో ఉన్నారు. విజయశాంతి, జీవిత వంటి వారు పార్టీకి సేవలందిస్తున్నారు. సభలకు, సమావేశాలకు అట్రాక్షన్ కోసం తప్పించి వారితో పెద్దగా ప్రయోజనం లేదన్నది గతంలోనూ అనేక సార్లు రుజువయింది. కాంగ్రెస్ పార్టీలో నగ్మా చేరి ఏళ్లు గడిచినా సాధించింది ఏమీ లేదు. తమిళనాడులో దేవతగా ఆరాధించి, గుడి కట్టిన చోటనే ఖుష్బూను ఎన్నికల్లో మాత్రం ఆదరించలేదు. దీనిని బట్టి సినిమా హీరో, హీరోయిన్లకు, సెలబ్రిటీలు పెద్దగా రాజకీయాల్లో రాణించలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. పొలిటికల్ లీడర్లు జనం వద్దకు చేరినంత సులువుగా వారు వెళ్లలేరు. వారి వద్దకు వెళ్లాలన్నా అవకాశం లేని పరిస్థితులు జనం దూరమయ్యారన్నది ఒక విశ్లేషణగా చెప్పుకోవచ్చు.
తెలంగాణలో తాజాగా....
ఇక తాజాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో భేటీ అయ్యారు. అంతకు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేశారు. ఈ భేటీలు ప్రజల్లో చర్చలు జరగడానికి ఉపయోగపడతాయి. అంతే తప్ప రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్నది అక్షర సత్యం. వాళ్ల సభలకు జనం రావచ్చు. ఈలలు వినిపించవచ్చు. సభ సక్సెస్ అయిందనిపించుకోవచ్చు. అంతే తప్ప ఎన్నికలకు వచ్చే సరికి జనం తమకు దగ్గరగా ఉండే వాళ్లనే ఎంపిక చేసుకుంటారు. సినిమా ఒక మూడు గంటల వినోదం. కానీ రాజకీయం ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమం కోసమే ప్రజలు ఎదురు చూస్తుంటారు. దానికే వారు ఓటేస్తారు. మరి బీజేపీ ఈ సినీనటులతో సీన్ మార్చేయాలనుకోవడం వృధా ప్రయాస అన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నదే. మరి చూడాలి.. తెలంగాణలో బీజేపీ సినిమా టాక్టిస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.