ఆయన వస్తే చాలట.. ఈయనకు తోడుంటారట

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు మార్గాలను వెతుక్కుంటుంది

Update: 2022-01-09 07:38 GMT

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం, పార్టీ సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టాల్సిందే. ఎవరైనా సరే బలమైన నేత అంటే పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పార్టీకి ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపగల నేత. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం బలంగా ఉంటే ఆటోమేటిక్ గా క్షేత్రస్థాయిలో బలపడుతుందని ఇప్పటికే బీజేపీ నేతలు ఒక అవగాహనకు వచ్చేశారు.

ఈటల కాకుంటే?ఆయన వస్తే చాలట.. ఈయనకు తోడుంటారట
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల కాకుంటే బీజేపీ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్న తర్వాతే ఈ సమాధానం దొరికిందట. అందుకే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపగల నేత కోసం చూస్తున్నారు. ఈటల రాజేందర్ బీసీ వర్గానికి చెందిన బలమైన నేత. ఆయన బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయగలరు. ఇక ఈటలకు తోడు పెద్దాయన కూడా తోడయితే మరింత పార్టీకి హైప్ వస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తుందట.
ప్రొఫెసర్ ను కూడా...
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ను బీజేపీలోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటున్నారు. 2014 ముందు వరకూ కోదండరామ్ అందరివాడుగానే ఉన్నారు. విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఆయనను అన్ని రాజకీయ పార్టీలు దూరం పెట్టాయి. చివరకు బీజేపీ కూడా. దీంతో కోదండరామ్ సొంత పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి కోదండరామ్ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నట్లు కన్పిస్తున్నారు.
ఆలోచనల్లో మార్పు....
కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కోదండరామ్ ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమయింది. అయితే కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే తన శక్తి సరిపోవడం లేదని కోదండరామ్ సయితం భావిస్తున్నారు. కాంగ్రెస్ లో నేతలే ఆ పార్టీని ఎక్కిరానివ్వరన్నది అర్థమయింది. దీంతో బీజేపీ యే బెస్ట్ అని ఆయన కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు కూడా కోదండరామ్ పార్టీలోకి వస్తే కీలక పదవి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటింపచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తుంది. ఒకవైపు ఈటల, మరోవైపు కోదండరామ్ పర్యటిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మంచి హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News