కన్నడ నాట బొమ్మై సీన్ ఇదేనా?

కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది.

Update: 2022-07-30 06:46 GMT

కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. గత ఎన్నికలలో అధికారంలోకి రాలేకపోయినా, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చింది. సీనియర్ నేత యడ్యూరప్పను సాగనంపింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని యడ్యూరప్ప చెప్పేశారు. తన కుమారుడు బరిలో ఉంటారని ఆయన ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసరావజ్ బొమ్మై వల్ల తిరిగి కర్ణాటకలో అధికారంలోకి వస్తుందా? లేదా? అన్న అనుమానం అందరికీ ఉంది.

లింగాయత్ లు....
యడ్యూరప్ప బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేత. బొమ్మైకు ఆ సామాజికవర్గంలో అంత గుర్తింపు లేదు. యడ్యూరప్పను తొలగించారన్న కసితో లింగాయత్ సామాజిక వర్గం ఉన్నట్లు గుర్తించారు. యడ్యూరప్పను వయసు సాకు చూపి పంపించేశారని లింగాయత్ లలో అధికమంది అభిప్రాయపడుతున్నారు. దీంతో లింగాయత్ వర్గం గంపగుత్తగా ఈసారి బీజేపీకి అండగా నిలుస్తుందన్న నమ్మకం లేదు.
సెంటిమెంట్ ను...
అందుకే సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తుంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఇటీవల హత్యకు గురైన బీజేపీ యువనేత హత్యను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రవీణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్పారు. ఆయన తిరిగి ప్రయాణం అయిన సందర్భంలోనే మంగళూరు నగరంలో మహ్మద్ ఫాజిల్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
వరస హ్యతలతో....
దీంతో వరస హత్యలతో కన్నడ రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఎన్నికలు ఇంకా ఏడాది లేకున్నా అప్పుడే హత్యలతో సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసే పనిలో బీజేపీ పడింది. యడ్యూరప్ప గైర్హాజరీలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా విశ్వసిస్తుంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది. యడ్యూరప్ప కూడా బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారు. అయితే బలమైన లింగాయత్ లు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానంగానే ఉంది. బీజేపీ మాత్రం మరోసారి అధికారంలోకి నేరుగా వచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి.


Tags:    

Similar News