కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షా

Update: 2018-09-15 12:40 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ శంఖారావం పూరించింది. మహబూబ్ నగర్ లో శనివారం ‘మార్పు కోసం’ నినాదంతో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లడాయి మొదలైందని స్పష్టం చేశారు. మార్పు కోసం బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

- జమిలి ఎన్నికలపై కేసీఆర్ మాట మార్చారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై అదనపు భారం వేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. మే నెలలో గెలవలేని కేసీఆర్ డిసెంబర్ లో ఎలా గెలుస్తారు..?

- 2014లో గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారు. ఈ ఎన్నికల్లోనైనా కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పగలరా..? తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేస్తారా..?

- కేసీఆర్ ఎంఐఎంకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా దేశం గర్వించేలా నిర్వహిస్తాం.

- తెలంగాణలో నాలుగేళ్లుగా 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, తాము అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు ఉండవు.

- మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేసీఆర్ అంటున్నారు, అలా ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది.

- దళితులకు, గిరిజనులకు బీజేపీతోనే న్యాయం జరుగుతుంది.

- రాహుల్ గాంధీ ఈ మధ్య పగటికలలు కంటున్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలు ఎన్నో తెలుసుకోవాలి.

- కాంగ్రెస్ పార్టీకి తెలుగువారిపై గౌరవం లేదు. అంజయ్య, పీవీ నరసింహారావును అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

- అస్సాంలో వలసదారుల లెక్క తేల్చితే టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అందరూ వ్యతిరేకించారు. బంగ్లాదేశ్ వలసదారులపై టీఆర్ఎస్ వైఖరి చెప్పాలి.

Similar News