కమలం కనుసన్నల్లోనే ఏపీ పాలిటిక్స్
ప్రధాన పార్టీలన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీ పెద్దల ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి
కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి బీజేపీ చేసిందేమీ లేదు. పైగా అన్ని ధరలు విపరీతంగా మోదీ పాలనలోనే పెరిగాయి. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో ఆ పార్టీకి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపీలో ఓటు బ్యాంకు లేదు. నాయకులు లేరు. ఇక ఉన్న బీజేపీకి కూడా పెద్దగా ఓటు బ్యాంకు లేదు. అయినా రాష్ట్ర విభజనలో పొందుపర్చిన అంశాలపై గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు.
బీజేపీ చుట్టూ...
అయినా ప్రధాన పార్టీలన్నీ బీజేపీ చుట్టూ వెంపర్లాడుతున్నాయి. పార్టీ పెద్దల ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు బీజేపీని విడిచి పెట్టేందుకు కూడా ఇష్టపడటం లేదు. నేరుగా పొత్తు లేకపోయినా బీజేపీకి అనుకూలంగా ప్రతి నిర్ణయాన్ని రెండు పార్టీలు తీసుకుంటున్నాయి. ఇక జనసేన సంగతి సరేసరి. ఆ పార్టీ ఎటూ బీజేపీతో పొత్తులోనే ఉంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో అంటకాగేందుకే ప్రయత్నిస్తున్నాయి. ప్రజలలో వ్యతిరేకత ఉందని తెలిసినా కాదనుకోవడానికి ఇష్పపడటం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేస్తున్నారు.
వ్యతిరేకత ఉన్నా...
నిజానికి 2019 ఎన్నికల్లోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అందుకే ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ చంద్రబాబు మాత్రం కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకతను తన వైపునకు రాకుండా చూసుకునేందుకు ఆ పార్టీతో అలయన్స్ నుంచి బయటకు వచ్చారు. దారుణంగా దెబ్బతిన్నారు. సఖ్యతగా ఉన్న వైసీపీని ప్రజలు గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. దీన్ని బట్టి ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా దానిపైన ఉన్న వ్యతిరేకత ఇక్కడ లోకల్ గా పనిచేయదని అన్ని పార్టీలకూ అర్ధమయినట్లుంది.
పోలింగ్ సమయంలో...
పోలింగ్ సమయంలో ప్రాంతీయ పార్టీలనే చూస్తారే కాని, బీజేపీని చూడరన్న విషయం అర్థమయింది. అందుకే అన్ని పార్టీలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేరుగా మద్దతు పలికాయి. అన్ని అంశాలలో వెనుకే నిలబడుతున్నాయి. ఎన్నికల వేళ తమకు పరోక్షంగా సహకరించాలన్న భావనతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సయోధ్యగా ఉన్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోవడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు, మద్దతు తెలిపేందుకు ఏ పార్టీకి సిద్ధంగా లేవు. బీజేపీ ఏం చేసినా దానినే పట్టుకుని వేలాడుతున్నాయి. ధరలు పెంచినా ఒక్కరూ పన్నెత్తు మాట అనని వైనం. ప్రజలు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పై ఉన్న వ్యతిరేకతను పట్టించుకోక పోవడంతోనే పార్టీలన్నీ బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నాయని చెప్పక తప్పదు.