Janasena : రగులుతున్న క్యాడర్.. నలిగిపోతున్న లీడర్
జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే వారు బయట పడుతున్నారు
జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే వారు బయట పడుతున్నారు. తాము ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలే పెత్తనం సాగిస్తున్నారని నిన్న జరిగిన జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ కు కొందరు ఎమ్మెల్యేలు నేరుగా చెప్పడాన్నిబట్టి చూస్తే వారు ఎంతగా మదనపడుతున్నారో అర్థమవుతుంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉన్న చోట జనసేన నేతలను అసలు పట్టించుకోవడం లేదు. వారి గోడు వినే వారు లేరు. గత ఎన్నికల్లో జనసేన 21, బీజేపీ ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచాయి. టీడీపీ 144 స్థానాల్లో పోటీచేసి 135 నియోజకవర్గాల్లో గెలిచింది.
ఈ నియోజకవర్గాల్లో...
ఈ 135 నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నేతలకు అసలు ప్రాధాన్యత లేదు. కనీసం నామినేటెడ్ పదవులు కూడా దక్కలేదు. దక్కినా డైరెక్టర్ పోస్టులు తప్పించి కీలకమైన పోస్టులో టీడీపీ నేతలనే నాయకత్వం నియమించింది. అయితే పవన్ కల్యాణ్ నిన్న జరిగిన జనసేన శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలను తాను సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తానని చెప్పి వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కూటమి ఏర్పడిన తర్వాత 2023లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమన్వయ కమిటీని నియమించుకున్నారు.
కమిటీ సమావేశం ఎప్పుడు?
జనసేన కమిటీ తొలి సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో 2023లో జరిగింది. అప్పటికీ ఇంకా బీజేపీ కూటమిలో చేరలేదు.ఈ సమావేశం తర్వాత మరొకసారి ఎన్నికలకు ముందు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అప్పటి నుంచి 2024 లో గెలిచిన తర్వాత కూటమి పార్టీలు సమన్వయ కమిటీ అంటూ ఏర్పాటు చేయకపోవడం విశేషం. మొన్నా మధ్య తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు. అంతే తప్ప నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించలేదు. నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు జనసేన, బీజేపీ అగ్రనేతలతో సమావేశమై జాబితా ఇవ్వాలని చెప్పారు తప్పించి నియోజకవర్గాల్లో కూటమి కలసి ఉండాలని చెప్పే ప్రయత్నం చేయడానికి సమన్వయకమిటీ సమావేశం కాలేదన్నది వాస్తవం.మరి కూటమి మధ్య సమన్వయం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుంది.