Vijaya Santhi : ఎమ్మెల్సీగా రాములమ్మ పేరు ఎలా ఖరారయిందంటే?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విజయశాంతి పేరు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది

Update: 2025-03-10 03:57 GMT

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విజయశాంతి పేరు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అసలు విజయశాంతి పేరును ఎవరూ అంచనా వేయలేదు. ఢిల్లీలో ఉండి మల్లికార్జున ఖర్గేను కలిసినప్పటికీ ఆమె పేరు ఖరారు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ భావించలేదు. ఎందుకంటే పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి సలహాలు, సూచనలు తీసుకున్నట్లే కనిపించినా వారి నోటి నుంచి విజయశాంతి పేరు అసలు వినపడలేదు. ఎక్కువగా ఇతర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సామాజికవర్గాల వారీగా అనేక సమీకరణాలు ఉంటాయని భావించారు.

ఏ దశలోనూ కనిపించని...
అంతే తప్ప విజయశాంతి పేరు ఏ దశలోనూ వినిపించలేదు. కనిపించలేదు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న విజయశాంతి లాబీయింగ్ చేసుకుని ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. నేరుగా మల్లికార్జున ఖర్గేను కలసి తాను పార్టీ విజయం కోసం చేసిన కృషిని గుర్తు చేసి మరీ బీఫారం తెచ్చుకున్నారు. అయితే విజయశాంతి ఎంపికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయశాంతి ఎప్పుడూ బయటకు రారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. ప్రభుత్వ సంక్షేమపథకాలను కూడా జనాలకు చేరవేయడంలో విజయశాంతి పాత్ర తక్కువనే చెప్పాలి. తక్కువే కాదు అస్సలు లేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత గాంధీభవన్ కు వచ్చింది కూడా వేళ్ల మీద లెక్కించ వచ్చు.
ఎన్నికల సమయంలో తప్పించి...
కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే విజయశాంతికి పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని ఊహకు కూడా అందలేదు. ఎందుకంటే ఏ కోణంలో చూసినా విజయశాంతి పేరు చివరిలోనే ఉండటంతో ఆ పేరును సీనియర్ నేతలు కూడా పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పాటు విజయశాంతికి అనేక పార్టీలు మారిన చరిత్ర ఉంది. తల్లి తెలంగాణ పార్టీ పెట్టడమే కాకుండా, తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలిచారు. తర్వాత వరసగా కాంగ్రెస్, బీజేపీ మళ్లీ కాంగ్రెస్ లో చేరడంతో ఆమెకు రాజకీయంగా నిలకడలేదని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటారు. అదే సమయంలో ప్రజలను ప్రభావితం చేయగలిగిన చరిష్మా కూడా లేకపోవడంతో పాటు అవుట్ డేటెట్ సినీ నటి కావడంతో విజయశాంతిని ఎమ్మెల్సీగా ఖరారు చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా వచ్చి అందరికీ షాకిచ్చారు రాములమ్మ.


Tags:    

Similar News