ఉప్పరపల్లిలో 800 ఏళ్ల శివాలయానికి పునర్జీవం

సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి కృషిని కొనియాడిన డా. ఈమని శివనాగిరెడ్డి

Update: 2026-03-01 14:25 GMT

సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి కృషిని కొనియాడిన డా. ఈమని శివనాగిరెడ్డి

శిల్పాలు, శాసనాలు వెలుగులోకి

వెయ్యేళ్ల చరిత్రకు గ్రామం సాక్ష్యం అన్న పరిశోధకుడు

ఉప్పునుంతల: మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపల్లి గ్రామంలో 800 ఏళ్ల నాటి శిథిల శివాలయాన్ని పరిరక్షించిన సర్పంచ్ బొజ్జ గీత అమరేందర్ రెడ్డిని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు డా. ఈమని శివనాగిరెడ్డి అభినందించారు. సీఎం ప్రవాసి ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఆదివారం గ్రామాన్ని సందర్శించారు. పురావస్తు అవశేషాలను పరిశీలించారు.

ఊర చెరువు ఒడ్డున ఉన్న వీరన్న గుడి, శివాలయం, అక్కడి శిల్పాలను శివనాగిరెడ్డి చూశారు. శివాలయంలో చాళుక్యుల కాలం నాటి శివలింగం ఉందన్నారు. వీరన్న గుడిలో కాకతీయుల కాలం నాటి నిలువెత్తు వీరభద్రుడి విగ్రహం కనిపిస్తోందన్నారు. మరో శివ విగ్రహం తల భాగం కూడా లభ్యమైందన్నారు. ఆలయాల ముందు గోగ్రహణ సందర్భంగా జరిగిన ఘర్షణలో మరణించిన ఇద్దరు వీరుల శిల్పాలు ఉన్నాయని చెప్పారు. కాకతీయుల కాలం నాటి నాగదేవత శిల్పాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ కలిపి గ్రామానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

శివాలయం ముందున్న బండలపై కొత్త రాతియుగం నాటి రాతి గొడ్డళ్లు, అరగదీసిన ఆనవాళ్లు గుర్తించామని శివనాగిరెడ్డి తెలిపారు. అవి సా.శ.పూ. 4000 సంవత్సరాల నాటివని అంచనా వేశారు.

గ్రామ శివారులోని కస్పా బండ వద్ద భూమిలో కూరుకుపోయిన కందూరి చోళ భీమచోడుని శాసనాన్ని సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి జేసీబీ సహాయంతో బయటకు తీయించారు. ఆ శాసనాన్ని చదివిన శివనాగిరెడ్డి, మామిళ్లపల్లి నరసింహస్వామి పూజలు, నైవేద్యాల కోసం గ్రామంలో కొంత భూమిని దానం చేసినట్లు అందులో వివరాలున్నాయని తెలిపారు.




 ఈ కార్యక్రమంలో శిల్పి వెంకట్ రెడ్డి, పీ. వీరశేఖరాచారి, ఉపసర్పంచ్ శ్రీనివాసచారి, వార్డు సభ్యులు దామోదర్ రెడ్డి, వెంకటయ్య, పర్వతాలు, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, జగత్ రెడ్డి, తోటపల్లి వెంకటరెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, తోల్ల రాజు యాదవ్, ప్రదీప్ రెడ్డి, శేఖర్ గౌడ్, కత్తులయ్య పాల్గొన్నారని సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News