Kavitha : కవిత కుటుంబానికి, పార్టీకి మరింత దూరం అయ్యారా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ లభించింది

Update: 2026-02-27 12:33 GMT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ లభించింది. దీంతో ఆమె రాజకీయంగా తనను తాను నిలదొక్కుకోవడానికి అవసరమైన బూస్ట్ లభించిందని భావిస్తుంది. మరో రెండు నెలల్లో కొత్త పార్టీని కవిత ప్రకటిస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ కేసులో క్లీన్ చిట్ ఆమెకు ఏ రకంగా ఉపయోగపడుతుందని పక్కన పెడితే ఆమె మరోసారి బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయంలో కొంత తొందరపడ్డారన్నది వాస్తవం. కవిత కేసు తీర్పు వచ్చిన వెంటనే ఆమెకు శుభాకాంక్షలు చెబుతూనే గత ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణం ఈ కేసు అని చెప్పి మరోసారి కవిత ఆగ్రహానికి గురయ్యారు.

కేటీఆర్ ట్వీట్ తో...
తాను అరెస్ట్ అవ్వక ముందే తెలంగాణ శాసనసభలో ఎన్నికలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించి వ్యతిరేకంగా చేసిన ప్రచారాన్ని ఆమె గుర్తు చేశారు. తాను కేసీఆర్ కు లేఖలో ఏం చెప్పానని, గత ఎన్నికల్లో అవినీతిపరులకు, ప్రజల్లో అసంతృప్తి ఉన్న నేతలకు టిక్కెట్లు వద్దని చెప్పానని, అయితే దానికి విరుద్ధంగా పాత వారికే, ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురయిన వారికి మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ ఓటమి పాలయిందని చెప్పానని కవిత అన్నారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని కూడా తాను నాడు వ్యతిరేకించానని చెప్పారు.
సానుభూతి వస్తే...
నిజాలు చెబితే నిందలు తనపై వేస్తారా? అని కవిత ఎదురుదాడికి దిగారు. దీంతో తన సోదరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ వచ్చిందన్న ఆనందం కంటే కేటీఆర్ చేసిన ట్వీట్ కారణంగా కవిత మరింత పార్టీకి దూరమయిందని అనుకోక తప్పదు. ఆమెలో మరింత పట్టుదల పెరిగిందని అంటున్నారు. కవిత సొంత పార్టీ పెట్టి విడిగా పోటీ చేసినందువల్ల నష్టం ఎంతో కొంత బీఆర్ఎస్ కే జరుగుతుందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నట్లుంది. కవితను దూరం చేసుకుంటూ కేటీఆర్ మరింత తప్పు చేస్తున్నారని గులాబీ పార్టీ నేతలే చెబుతున్నారు. అందుకే రౌస్ ఎవెన్యూ కోర్టులో ఐదున్నర నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన తనకు కోల్పోయిన కాలాన్ని తిరిగి ఎవరు ఇస్తారంటూ ఆమె ప్రజల్లోకి వెళితే ఎంతో కొంత సానుభూతి వస్తుంది. అది కారు పార్టీకే నష్టమని చెప్పక తప్పదు.







Tags:    

Similar News