KTR :గోక్కుంటే...పీక్కోవాల్సి వస్తుందే.. కేటీఆర్ వ్యూహం బెడిసి కొట్టిందా?

సీఎం రమేష్ నాయుడు, కేటీఆర్ మధ్య జరుగుతున్న వివాదంలో ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు

Update: 2025-07-27 12:38 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి మయసభలో దుర్యోధనుడి తరహాలో మారినట్లు కనపడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఏల ఇరుక్కోవలె? ఇరుక్కుంటిమి పో.. తీహార్ జైలుకు ఎందుకు వెళ్లవలె.. వెళ్లితిమి పో.. తాను ఎందుకు ఢిల్లీకి ఎందుకు వెళ్లవలె.. వెళ్లినితిని పో... బెయిల్ పై న్యాయవాదులతో చర్చించకుండా బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడును ఎందుకు కలవవలె? కలసినితిని పో...బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానన్న ప్రతిపాదన ఎందుకు తేవలె.. తెచ్చితిని పో... హెచ్.సి.యూ భూములపై రేవంత్ రెడ్డి పై కోపంతో రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించవలె... ప్రస్తావించితినిపో... ఫోర్త్ సిటీ కాంట్రాక్టు పనులను ఏల ప్రజల ముందుంచవలె...హతవిధీ... ఇప్పుడు అటు ఇటు తిరిగి బీజేపీతో విలీనం పై రచ్చ ఏల జరగవలె.. అన్నట్లుంది కేటీఆర్ వ్యవహారం.

బండి సంజయ్ ఎంట్రీతో...
సీఎం రమేష్ నాయుడు, కేటీఆర్ మధ్య జరుగుతున్న వివాదంలో ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇప్పుడు అసలు సమస్య పక్క దారి పట్టి బీజేపీతో బీఆర్ఎస్ విలీనం మాత్రమే హైలెట్ అవుతుంది. వాస్తవానికి హెచ్.సి.యూ భూమి వివాదంలో సీఎం రమేష్ రేవంత్ రెడ్డికి సహకరించారన్నది కేటీఆర్ ఆరోపణ. అదే సమయంలో ఫోర్త్ సిటీలో 1600 కోట్ల రూపాయల పనులను సీఎం రమేష్ కు అప్పగించారన్న సెంటిమెంట్ తో పార్టీకి కొంత హైప్ తేవాలనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కామ్ గా ఉన్నప్పటికీ ఇది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయినట్లు కనపడుతుంది.
అసలు విషయం పక్కదారి పట్టి...
అసలు విషయం పక్క దారి పట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన మాత్రమే హైలెట్ గా నిలిచింది. నాడు కవిత అరెస్టయినప్పుడు ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ ఈ ప్రతిపాదన తెచ్చారన్నది సీఎం రమేష్ ఆరోపణ. అదే సమయంలో తాను అంతటి వాడిని కానని, చెల్లెలుతో వచ్చిన విభేధాలు తనపై ఆరోపణలు చేయడానికి కారణమయ్యారని అంటున్నారు.మరొకవైపు కవిత కూడా కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రస్తావన తేవడాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరొకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ విలీనం హైలెట్ అవుతుంది. కేసీఆర్ కేటీఆర్ కు సిరిసిల్ల టిక్కెట్ ఇవ్వలేదని, అయితే కేటీఆర్ వెళ్లి సీఎం రమేష్ ను కలిశారన్నారు. సీఎం రమేష్ చెప్పబట్టే సిరిసిల్ల టిక్కెట్ కేసీఆర్ ఇచ్చాడన్న బండి సంజయ్ సిరిసిల్ల లో నాడు గెలిచేందుకు కేటీఆర్ కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేసిన మాట కూడా వాస్తవమేనని అన్నారు. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలో నిజముందన్నారు.
కేటీఆర్ మాత్రం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సీఎం రమేష్ , సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటలో జరిగిన పదవి వేల కోట్ల కుంభకోణంపైనా, ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండింటిపైనా కలిసి చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు సీఎం రమేష్ కు రేవంత్ రెడ్డికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా1660 కోట్ల కాంట్రాక్ట్ అని అన్నారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని, తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ చెబుతున్నాఅసలు చర్చ మాత్రం విలీనం పైనే జరుగుతుంది. మరి కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఆయనకే రాజకీయంగా బూమరాంగ్ అవుతున్నాయా? అన్న అనుమానం బీఆర్ఎస్ నేతల్లో కలుగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలీనంపైనే ఎక్కువగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.






Tags:    

Similar News