Amit Shah : రేవంత్ విను.. పదికి పైగా మేం గెలవబోతున్నాం

తెలంగాణలో పది సీట్లకు పైగానే తాము గెలుస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2024-05-09 07:35 GMT

తెలంగాణలో పది సీట్లకు పైగానే తాము గెలుస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రేవంత్ రెడ్డి వినూ.. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలను మాత్రమే గెలిచామని, ఈసారి పదికి పైగా స్థానాలను గెలుస్తామని తెలిపారు. భువనగిరిలో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడపోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. అయినా వేరే పార్టీ నుంచి తెచ్చుకుని మరీ పోటీకి దింపారన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలిస్తే దేశంలో బీజేపీకి నాలుగు వందల స్థానాలు వచ్చినట్లేనని అన్నారు. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అసత్య ప్రచారాన్ని చేస్తూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.

ముస్లిం రిజర్వేషన్లు తీసేసి...
భువనగిరిలో రాహుల్ చెంచాకు టిక్కెట్ ఇచ్చారన్నారు. తెలంగాణలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మిగిలిన సామాజికవర్గాల ఉన్నతికి అడ్డుపడిందన్నారు. బీజేపీకి పది స్థానాలు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి, ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఇస్తామని తెలిపారు. మోదీ గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ చెప్పే గ్యారంటీలు ఏమాత్రం పనికి రావని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ఇంతవరకూ చేసిందా? అని ప్రశ్నించారు. రైతులకు పదిహేను వేల పెట్టుబడి ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదన్నారు.
వాగ్దానాలు ఏమయ్యాయి?
రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న వాగ్దానం ఏమయిందన్నారు. వరిపై ఐదు వందల బోనస్ కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు ఐదు లక్షలకు ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పటికీ అమలు చేయదన్నారు. మోదీ చెప్పిన వన్నీ చేసి చూపిస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేసినంత మాత్రాన ఒరిగేదీమీ లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, అది మోదీ గ్యారంటీ అంటూ ఆయన అన్నారు. కాంగ్రెస్ ను మరోసారి నమ్మితే ఇక మునిగినట్లేనని అన్నారు.


Tags:    

Similar News