BJP : తెలంగాణ కమలంలో ఎవరి దారి వారిదే.. రేపు లీడర్లను దంచేయనున్న అమిత్ షా

రేపు తెలంగాణకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వస్తున్నారు. నేతలకు క్లాస్ పీకనున్నారు.

Update: 2025-06-28 12:29 GMT

రేపు తెలంగాణకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వస్తున్నారు. అయితే ఆయన వస్తున్నది కేవలం పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభానికి మాత్రమే కాదు. పార్టీని గాడిలో పెట్టడానికే అని సమాచరం. ఒక రకంగా చెప్పాలంటే కమలంపార్టీ నేతలకు వార్నింగ్ లాంటిది ఇచ్చి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. రేపు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేటకు చేరకుంటారు. అక్కడి నుంచి 1.45గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ కు చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి వినాయక్ నగర్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుని దానిని ప్రారంభించనున్నారు.

పసుపు బోర్డు కార్యాలయంలో...
మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అరగంట సేపు బోర్డు కార్యాలయంలోనే ఉంటారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజమాబాద్ లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత నాలుగు గంటల వరకూ పాలిటిక్నిక్ గ్రౌండ్స్ లోజరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.ఐదు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. అయితే కొంత సేపు బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశం అవుతారని తెలిసింది. పసుపు బోర్డు కార్యాలయంలోనే బీజేపీ నేతలతో ఆయన సమావేశమై పార్టీ అధ్యక్ష ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం.
ఆధిపత్యపోరుతో...
బీజేపీలో ప్రస్తుతం ఆధిపత్యపోరు నడుస్తుందని హైకమాండ్ కు సమాచారం అందింది. ఒకరిని మరొకరు లెక్క చేయరు. ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఎవరి దారి వారిదే. పార్టీ క్యాడర్ ఇప్పుడు అయోమయంలో ఉంది. పార్టీని కలిసికట్టుగా నడిపించే వారిని ఎంపిక చేయడానికి అధినాయకత్వం ఇన్నాళ్లు ఆగిందని చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి వాళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే పార్టీ నాయకత్వం ఒక పేరును ఖరారు చేసిందంటున్నాు. ఎన్నికలకు ముందు పార్టీ క్యాడర్ తో పాటు నేతలను ఐక్యంగా నడిపించేందుకు సరైన నేత కావాలని భావించి ఆ మేరకు ఒకరిని ఎంపిక చేసినట్లు తెలిసింది.
ఆశావహులు అనేకమంది...
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకున్న దూకుడుతో పార్టీ ఇబ్బందులు పడుతుందని అంటున్నారు.ఈటల రాజేందర్ కూడా సామాజికవర్గం పరంగా పార్టీ అధ్యక్ష పదవి కోసం వత్తిడితెస్తున్నారు. డీకే అరుణ ఇప్పటికే జాతీయ పార్టీలో పదవి ఉండటంతో ఆమె కూడా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారంటున్నారు. అయితే వీరందరిలో యువతకు ప్రాధాన్యత ఇస్తారా? లేక సీనియారిటీని కుర్చీని ఎక్కిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. పేరుకు ఎన్నిక జరుగుతుంది. కానీ అధినాయకత్వమే పార్టీ అధ్యక్షుడి పేరును ఖరారు చేస్తుందని వేరే చెప్పాల్సినపనిలేదు. రేపటి అమిత్ షా పర్యటనలో లీడర్లకు అమిత్ షా క్లాస్ పీకడమే కాకుండా తల ఎగరేయవద్దని వార్నింగ్ ఇచ్చి వెళతారంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News