కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మృతి చెందిన, అస్వస్థతకు గురైన మహిళల బంధువులు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి..

Update: 2022-08-30 06:12 GMT

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఆరోగ్యం విషమించిన మహిళను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో 27 మంది మహిళలు ఈనెల 25వ తేదీన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

కాగా.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మృతి చెందిన, అస్వస్థతకు గురైన మహిళల బంధువులు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని, ఇక్కడ జరగడంపై అనుమానంగా ఉందంటున్నారు. మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నంలోని సీతారాంపేటకు చెందిన లావణ్యం ఈనెల 25వ తేదీన కుని ఆపరేషన్‌ నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ముగ్గురూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం తర్వాత ఇంటికి వెళ్లారు.
ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మమతను బీఎన్‌రెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అలాగే సుష్మను కూడా మరో ఆస్పత్రిలో చేర్పించగా, ఆమె కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆరోగ్య పరిస్థితి విషమించిన లావణ్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. మరో ఏడుగురు మహిళలు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. ఆపరేషన్లలో పొరపాటు ఏమి జరగలేదని, ఆరోగ్యం పూర్తిగా పరిశీలించాకే ఇంటికి పంపించామంటున్నారు. 

కు.ని ఆపరేషన్లు వికటించి మహిళలు చనిపోవడంపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. కు.ని ఆపరేషన్లు దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియేనని తెలిపారు. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో అనుభవం ఉన్న సర్జన్లతో 34 మందికి ఆపరేషన్లు చేసినట్లు పేర్కొన్నారు. వారిలో నలుగురు చనిపోగా.. ఏడుగురు అస్వస్థతకు గురయ్యారని, చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ కు తరలించినట్లు చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందని, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కాగా.. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి వైద్యుడు, సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశామని, కు.ని ఆపరేషన్లు వికటించడంపై ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు.



Tags:    

Similar News