Weather Update : చలి తీవ్రత తగ్గింది... కానీ వాతావరణ శాఖ కీలక అప్ డేట్
రెండు తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రత నుంచి బయటపడ్డాయి
రెండు తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రత నుంచి బయటపడ్డాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొంత రాత్రి వేళ, ఉదయం ఆరు గంటలలోపు కొంత చలి తీవ్రత ఇంకా కొనసాగుతుంది. అయితే పొగమంచు మాత్రం ఇంకా వీడలేదు. దీంతో ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఏపీలో చలి తీవ్రత తగ్గి...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది. ఇప్పటికే చెమటలు పడుతున్నాయి. ఉక్కపోత ప్రారంభమయింది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. చలి తీవ్రత నుంచి బయటపడటంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒకరకంగా ప్రజలు ఇబ్బందుల నుంచి దాదాపుగా బయటపడినట్లేనని భావిస్తున్నారు. ప్రధానంగా ఎండ శరీరానికి తగలడంతో కొంత ఆనందంగా ఉంది.
ఇంకా తగ్గకపోయినా...
తెలంగాణలో ఇంకా చలి తీవ్రత తగ్గలేదు. కొద్దిగా చలిగాలులు కొనసాగనున్నాయి. రెండు నెలల పాటు చలి తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. తెలంగాణ అంతటా ఇప్పుడు డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోనూ చలితీవ్రత తగ్గింది. ప్రజలు తమ సాధారణ జీవనస్థితికి ఉదయం నుంచి అలవాటు పడిపోయారు. నిన్నటి వరకూ మార్నింగ్ వాకర్స్ కొంత చలితో భయపడినా రెండు రోజుల నుంచి ఉదయం నుంచి తిరిగి నడకను ప్రారంభించారు. మొత్తం మీద చలి తీవ్రత తగ్గడంతో ప్రజలు ఈ ఏడాది అతి తక్కువగా నమోదయిన ఉష్ణోగ్రతల నుంచి బయపడినట్లే.