తెలంగాణ తాజా వెదర్ రిపోర్ట్ : రెండు రోజులు రెడ్ అలెర్ట్

ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం..

Update: 2023-07-27 08:52 GMT

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుందని వివరించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది.

అదేవిధంగా రుతుపవన ద్రోణి బికానర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిస్సా పరిసరాలతో పాటు.. ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. గురువారం షీయర్ జోన్ 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందని తెలిపింది.
వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గురువారం భారీ నుండి అతి భారీవర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే శుక్రవారం (జులై28) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ వివరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి రెండురోజులపాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీపరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.


Tags:    

Similar News