3 కోట్ల విలువైన భూమి తండ్రి నిర్ణయమిదే!!
కొడుకు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ తండ్రి తనకు చెందిన 3 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
కొడుకు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ తండ్రి తనకు చెందిన 3 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వ్యక్తికి ఆస్తి అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, అందుకు అనుగుణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ తండ్రి చెబుతున్నారు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, వసంత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు కూడా అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో తిరిగి వచ్చారు. కుమారుడు రంజిత్ హన్మకొండలో భార్య, పిల్లలతో కలిసి సొంతింట్లో నివసిస్తున్నారు. ఆయన భార్య వసంత నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి కుమారుడు తనను పట్టించుకోవడం లేదని శ్యాంసుందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తి మొత్తాన్ని తనకు తెలియకుండానే కుమారుడు పట్టా చేయించుకున్నట్లు ఆయన ఆరోపించారు. తనను పట్టించుకోని కుమారుడికి ఆస్తి దక్కకుండా తన పేరున ఉన్న మూడెకరాల పొలాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.