BRS : అటు కొడుకు.. ఇటు కుమార్తె.. మధ్యలో కేసీఆర్.. కారు స్టీరింగ్ ఎవరి చేతిలో?
బీఆర్ఎస్ లో ఏదో బయటకు కనపడని రాజకీయం నడుస్తుంది.
బీఆర్ఎస్ లో ఏదో బయటకు కనపడని రాజకీయం నడుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నట్లే కనిపిస్తుంది. అన్న నాయకత్వాన్ని కవిత అంగీకరించినట్లు కనిపించడం లేదు. అందుకోసమే తెలంగాణ జాగృతి సంస్థను తిరిగి యాక్టివ్ చేశారు. అన్నివిభాగాలను నియమించారు. తానే జాగృతి చీఫ్ అని ప్రకటించుకున్న కవిత తనంతట తానే కార్యక్రమాలను డిజైన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ కు లేఖ బహిర్గతమయినప్పుడు, కేటీఆర్ పై ఆఫ్ ది రికార్డులో కవిత కేటీఆర్ పైవిమర్శలు చేసినప్పుడు ఆయన హైదరాబాద్ లో లేరు. విదేశాల్లో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాని దూరం మాత్రం పెరిగినట్లు కనిపిస్తుంది.
ఒకరికొకరు ఎదురుపడకుండా...
ఈ నెల 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు వస్తున్న సందర్భంలో కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కవిత ఉందనేమో తెలియదు కానీ కేటీఆర్ మాత్రం నాడు ఫామ్ హౌస్ కు వెళ్లలేదు. కేసీఆర్ వెంట కమిషన్ ఎదుటకు కూడా కేటీఆర్ వెళ్లలేదు. మరొకవైపు కేటీఆర్ ను ఫార్ములా ఈరేసు కేసులో ఈనెల 16వ తేదీన ఏసీబీ అధికారులు విచారణకు పిలిచినప్పుడు అందరు నేతలు కేటీఆర్ వద్దకు వచ్చారు. అయితే ఆరోజు కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లడం కూడా ఇద్దరి మధ్య దూరం కొనసాగుతుందన్న విషయం కనపడుతుంది. ఎందుకంటే కేటీఆర్ తనను అరెస్ట్ చేయవచ్చని నాడు చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలందరూ వచ్చినా కవిత మాత్రం రాకపోవడం పార్టీలోచర్చనీయాంశమైంది.
సొంత కార్యక్రమాలతో కవిత...
దీనికి తోడు కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ భవన్ కు దూరంగానే ఉంటున్నారు. పైగా కేసీఆర్ నుకమిషన్ విచారణకు పిలిచిందని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎవరూ అక్కడకు హాజరు కాలేదు. ఇప్పుడు కవిత ఏకంగా తనంతట తాను సొంతంగా కార్యక్రమాలను డిజైన్ చేసుకుంటూ పిలుపునిస్తుండటం చర్చనీయాంశమైంది. బీసీల రిజర్వేషన్లపై పోరాటానికి కవిత సిద్ధమయ్యారు. జులై 17వ తేదీన రైల్ రోకోకు పిలుపు నిచ్చారు. అంతే కాదు అవసరమైతే ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని కూడా తెలిపారు. ఇలా మరొక వైపు కేసీఆర్ రైతులకు అనుకూలంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేయాలని కార్యక్రమాలకు పిలుపు నిచ్చారు. ఇందుకోసం కేటీఆర్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.
కేటీఆర్ కార్యక్రమాలు మరొకవైపు...
ఇలా అన్న కేటీఆర్ ఒక వైపు వేరేలా కార్యక్రమాలను రూపొందించుకుంటుంటే...మరొకవైపు సోదరి కవిత మరొక అంశాన్ని తీసుకుని జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరివీ వేర్వేరు దారులన్నది స్పష్టంగా తెలుస్తోంది. తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్పించి మరొకరి నాయకత్వాన్ని అంగీకరించబోనని కవిత తేల్చి చెబుతుండగా, కేటీఆర్ మాత్రం కవిత కార్యక్రమాలకు ఎవరూ వెళ్లవద్దంటూ బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిన కేసీఆర్ మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇలా అన్నా చెల్లెళ్లు కారు స్టీరింగ్ ను చెరొక చేతుల్లోకి తీసుకోవడంతో అది ఎటువైపు పయనిస్తుందన్నది క్యాడర్ లో మాత్రం అయోమయం నెలకొంది. మొత్తం మీద బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుంది. అది కేసీఆర్ కు తెలిసి జరుగుతుందా? తెలియక జరుగుతుందా? అన్నది మాత్రం భవిష్యత్ లో తేలనుంది.